Share News

మీరు నన్ను ఆపాలనుకుంటే.. చంపాల్సిందే.. తిరుగుబాటుదారులకు మమత సవాల్..

ABN , Publish Date - Jul 04 , 2026 | 08:38 PM

రాజకీయంగా తనను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని, తనను ఆపాలంటే తన ప్రాణాలు తీయాల్సిందేనని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

మీరు నన్ను ఆపాలనుకుంటే.. చంపాల్సిందే.. తిరుగుబాటుదారులకు మమత సవాల్..
Mamata Banerjee

కోల్‌కతా, జులై 4: రాజకీయంగా తనను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని, తనను ఆపాలంటే తన ప్రాణాలు తీయాల్సిందేనని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. పార్టీని వీడి తిరుగుబాటు చేస్తున్న నాయకులను ఆమె ద్రోహులుగా అభివర్ణించారు. పార్టీ అధికారిక గుర్తు తన వైపు ఉన్న నమ్మకస్థుల వద్దే ఉంటుందని చెప్పారు.


శనివారం మమత మాట్లాడుతూ.. ‘పార్టీ సింబల్ ఎక్కడికీ పోదు. మీరు నన్ను ఆపాలని అనుకుంటే.. నన్ను చంపాల్సిందే. చంద్రిమా భట్టాచార్య ఈ రోజు రాజీనామా చేశారు. ఆమె ఇక్కడి పరిస్థితులపై ముందుగానే నాకు సమాచారం ఇచ్చారు. రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. ఆమె కుమారుడు యాంటీ తృణమూల్ గుంపులో చేరాడన్న కారణంతోనే చంద్రిమా భట్టాచార్య రాజీనామా చేశారు. అది ఆమె ఇష్టం. ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ, నేను మాత్రం వాళ్లతో చేతులు కలపను. నేను బీజేపీ ముందు తలవంచను. బెదిరింపులకు నా పార్టీ లొంగదు’ అని తేల్చి చెప్పారు.


పార్టీ ఆఫీస్ స్వాధీనంపై మమత ఆగ్రహం..

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గం కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకుంది. ఈ విషయంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నిన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి దానికి తాళం వేసిన వారికి నేను ఒకటే చెబుతున్నాను. మేము ఆ కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నాము. అది అక్టోబర్ 2027 వరకు మాకు లీజుకు ఇవ్వబడింది. తల్లి, మట్టి, మనుషుల ఆస్తిని ఎవరూ బలవంతంగా స్వాధీనం చేసుకోలేరు’ అని ఆమె అన్నారు.


ఇవి కూడా చదవండి

పిచ్చికుక్క దాడిలో 40 మందికి తీవ్ర గాయాలు

ప్రభుత్వ డేటా భద్రత.. ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్‌

Updated Date - Jul 04 , 2026 | 08:53 PM