ఆస్పత్రి సీఈఓకు మమతా బెనర్జీ వార్నింగ్.. దుమారం రేపుతున్న వీడియో..
ABN , Publish Date - May 31 , 2026 | 12:29 PM
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనాపూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు.
కోల్‌కతా, మే 31: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనార్‌పూర్‌లో స్థానికులు అభిషేక్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను సిబ్బంది కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి నుంచి బెల్ వ్యూ ఆస్పత్రికి తరలించారు. మేనల్లుడిపై దాడి జరిగిన విషయం తెలియగానే మమతా బెనర్జీ బెల్ వ్యూ ఆస్పత్రికి వెళ్లారు. అభిషేక్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
తీవ్రంగా గాయపడ్డ అభిషేక్‌కు చికిత్స అందించవద్దంటూ డాక్టర్లపై, ఆస్పత్రి యాజమాన్యంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. రాజకీయాలను రాజకీయాలుగానే చూడాలని, హింస, ఆయుధాలు, భయంతో రాజకీయాలకు సమాధానం చెప్పకూడదని హితవు పలికారు. ఆస్పత్రి లోపల బెల్ వ్యూ సీఈఓ ప్రదీప్ టాండన్‌తో మమతా బెనర్జీ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మమతా బెనర్జీ ఆస్పత్రి సీఈఓకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా వాయిస్ ఉంది.
ఆ వీడియోలో.. ‘టాండన్ మీరు చాలా తప్పు చేస్తున్నారు. మేము మీకు చేసిన సాయాన్ని దయచేసి గుర్తు తెచ్చుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించడు. మీరు తప్పుదోవపట్టిస్తున్నారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుండాలి. ప్రతీ ఒక్కరు మీ దురుసు ప్రవర్తనను గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. రేపు ఉండదు. అప్పుడు మేము చేయాల్సింది చేస్తాం’ అని మమతా అన్నట్లుగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
ఇవి కూడా చదవండి
స్టార్ ఆటగాళ్ల మధ్య ఆసక్తికర పోరు.. ఎవరిది పైచేయి?
స్ట్రాబెర్రీ ఫేస్ ప్యాక్.. చర్మానికి సహజమైన మెరుపు