Share News

డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తాం: ఖర్గే

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:21 PM

మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు.

డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తాం: ఖర్గే
Mallikarjun Kharge Says Opposition Will Take Collective Stand

రుద్రపూర్ (ఉత్తరాఖండ్), ఆగస్టు 9: మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా ఉమ్మడి నిర్ణయం తీసుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్‌ పర్యటనలో భాగంగా రుద్రపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు.


ఇటీవల లోక్‌సభలో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లుపై ప్రభుత్వం మళ్లీ ముందుకు వెళ్లాలని చూస్తే, ప్రతిపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశంలో చర్చించి ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తామని ఖర్గే తెలిపారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా, ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళలకు మూడో వంతు (1/3వంతు) రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.


విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ (FCRA) సవరణ బిల్లును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఖర్గే చెప్పారు. ఈ బిల్లుపై డీఎంకే అధినేత ఎం.కే. స్టాలిన్, మిజోరం సీఎం లాల్‌దుహోమాతో పాటు పలు మైనారిటీ క్రైస్తవ వర్గాల ప్రతినిధులు ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారని ఖర్గే చెప్పారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకే తాను ఇక్కడ పర్యటిస్తున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.


సీట్ల సంఖ్యను పెంచడం ద్వారా ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు లేదా దక్షిణ భారత దేశానికి లబ్ధి జరగదని, ఇది కేవలం సెంట్రల్ ఇండియాకే ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. సీట్లను 850కి పెంచితే లోక్‌సభ చైనా 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్'లా తయారవుతుందని తివారీ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆదివాసీల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

భాగ్యనగర మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు: కేటీఆర్

Updated Date - Aug 09 , 2026 | 04:35 PM