Major Bus Fire Averted: ప్రైవేట్ బస్సులో అగ్నిప్రమాదం.. ఆటో డ్రైవర్ హెచ్చరికతో..
ABN , Publish Date - Jan 13 , 2026 | 09:38 AM
పుదుచ్చేరిలోని ఫ్లైఓవర్‌పై బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. భయపడిపోయిన ప్రయాణికులు గట్టిగా సాయం కోసం అరవటం మొదలెట్టారు. కొంత మంది ప్రాణ భయంతో అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకారు. మిగిలిన వారు కూడా అతి కష్టం మీద బస్సు నుంచి బయటకు వచ్చేశారు..
పుదుచ్చేరిలోని 100 ఫీట్ ఫ్లైఓవర్‌పై ఓ ప్రైవేట్ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఆటో డ్రైవర్ హెచ్చరికతో 14 మంది ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు పుదుచ్చేరి న్యూ బస్టాండ్ నుంచి పొల్లాచికి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత బస్సు 100 ఫీట్ ఫ్లైఓవర్ పైకి వచ్చేసింది. అయితే సడెన్‌గా బస్సు ముందు భాగంలో పొగ రావటం మొదలైంది.
బస్సుకు ఆపోజిట్ డైరెక్షన్‌లో వస్తున్న ఆటో డ్రైవర్ ఇది గమనించాడు. బస్సు డ్రైవర్‌ను హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. కొన్ని క్షణాల్లోనే బస్సు మొత్తాన్ని పొగ కమ్మేసింది. భయపడిపోయిన ప్రయాణికులు సాయం కోసం గట్టిగా అరవటం మొదలెట్టారు. కొంత మంది ప్రాణ భయంతో అద్దాలు బద్దలు కొట్టి కిందకు దూకారు. మిగిలిన వారు కూడా అతి కష్టం మీద బస్సు నుంచి బయటకు వచ్చేశారు. బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతికష్టం మీద మంటల్ని ఆర్పేశారు. ఇక, సమాచారం అందుకున్న కలైవనమ్ ఎస్పీ నిత్య రాధాక్రిష్ణన్‌తో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. బస్సును పరిశీలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ బస్సు ప్రమాదంలో ప్రయాణికుల లగేజీ కాలి బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 మంది ప్రయాణిస్తున్నారు. ఆటో డ్రైవర్ అప్రమత్తం చేయకపోయి ఉంటే పెను విషాదం చోటుచేసుకుని ఉండేది. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 82ల మధ్య 28 ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి!
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం