Share News

ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే బూటులో దాచి.. బయటకు తెచ్చి!

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:17 AM

సంచలనం రేపిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2026 ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 లక్షల మందికి పైగా అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకున్న..

ప్రింటింగ్‌ ప్రెస్‌లోనే బూటులో దాచి.. బయటకు తెచ్చి!

  • మహారాష్ట్ర టెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వెనుక విస్తుపోయే నిజాలు

ముంబై, జూలై 12: సంచలనం రేపిన మహారాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2026 ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 లక్షల మందికి పైగా అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా నెట్‌వర్క్‌ తీరును చూసి సిట్‌ అధికారులే నివ్వెరపోతున్నారు. ఆగ్రా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి భివండీ హోటల్‌ రూమ్‌ వరకు సాగిన ఈ లీకేజీ వ్యవహారంలో నిందితులు అనుసరించిన వ్యూహం విస్తుగొలుపుతోంది. అత్యంత రహస్యంగా ప్రశ్నపత్రాలు ముద్రణ జరిగే యూపీలోని ఆగ్రా ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ఈ ముఠా.. అక్కడి ఉద్యోగులను మభ్య పెట్టి పేపర్లను బయటికి తెచ్చినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. జూన్‌ 15-17 మధ్య ఓ ఉద్యోగి ప్రశ్నపత్రాలను మడిచి తన బూట్ల కింది భాగంలో ఉంచి భద్రతా సిబ్బంది కళ్లు గప్పి బయటికి తెచ్చినట్లు తెలిపారు. ఇందులో ప్రింటింగ్‌ ప్రెస్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులకు ప్రమేయముందని.. వారికి తలా రూ.8 వేలు చెల్లించి.. ఒక ప్లాట్‌(స్థలం) ఇస్తామని హామీనిచ్చారని సిట్‌ అధికారులు వివరించారు. ఇక లీకేజీ కుట్రకు సూత్రధారిగా భావిస్తున్న బిజేంద్రకు దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఉద్యోగ, ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్‌ చేసిన చరిత్ర ఉంది. అయితే మహారాష్ట్ర పరీక్షల మండలి అధిపతికి మాత్రమే తెలిసిన ఆగ్రా ప్రింటింగ్‌ ప్రెస్‌ వివరాలు బిజేంద్ర గుప్తాకు ఎలా తెలిశాయనే దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ప్రశ్నపత్రాలు తనకు చేరగానే బిజేంద్ర మహారాష్ట్ర కోచింగ్‌ సెంటర్ల నెట్‌వర్క్‌ను సంప్రదించాడు. ప్రతి ప్రశ్నపత్రాన్ని రూ.80వేల చొప్పున విక్రయించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ పేపర్లు చేతులు మారుతూ..కింది స్థాయి దళారుల కమీషన్లు కలుపుకొని అభ్యర్థులకు భారీ ధరకు అమ్మినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో 12 మందిని అరెస్టు చేశారు. బిజేంద్ర ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 06:17 AM