Share News

రోగి మృతితో రణరంగంగా మారిన ఆసుపత్రి.. వైద్య పరికరాల ధ్వంసం

ABN , Publish Date - May 07 , 2026 | 04:03 PM

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉల్హాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 45 ఏళ్ల రోగి మరణించడంతో.. ఆగ్రహించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే..

రోగి మృతితో రణరంగంగా మారిన ఆసుపత్రి.. వైద్య పరికరాల ధ్వంసం
Maharashtra Hospital Attack

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉల్హాస్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 45 ఏళ్ల రోగి మరణించాడు. దీంతో ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు.. వార్డులోని వైద్య పరికరాలను ధ్వంసం చేయడమే కాకుండా, అక్కడి సిబ్బందిపై దాడికి దిగారు. భగవాన్ నింబోరే అనే వ్యక్తి కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతూ బుధవారం చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆసుపత్రిలో చేరిన రెండు గంటల్లోనే పరిస్థితి విషమించడంతో భగవాన్ మరణించారు. ఈ వార్త తెలియగానే మృతుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ, వార్డులోకి చొరబడి వైద్య పరికరాలను చిందరవందర చేశారు.


ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో మృతుడి భార్య, కుమారుడు, బంధువులు వార్డులోని సామాగ్రిని ధ్వంసం చేస్తూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ‘నా భర్త నాకు తిరిగి కావాలి.. మీరే ఆయనను చంపేశారు’ అని భార్య రోదించగా, ‘మేము సహాయం కోసం అరుస్తున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఇప్పుడెందుకు వస్తున్నారు?’ అని కుమారుడు అక్కడి వైద్యులను నిలదీశాడు. అక్కడి భద్రతా సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. పోలీసులు రంగంలోకి దిగి గొడవ సర్ధుమణిగేలా చేశారు.


ఇదిలా ఉంటే.. ఈ దాడిని నిరసిస్తూ, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వెంటనే విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకూ విధుల్లోకి చేరబోమని భీష్మించుక కూర్చున్నారు. విషయం తెలుసుకున్న మేయర్ అశ్విని నికమ్, పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని సిబ్బందితో చర్చలు జరిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో ఆసుపత్రి సిబ్బంది ఆందోళనను విరమించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్..

తమిళనాడు బద్ద శత్రవులు కలుస్తారా.. ఏడీఎంకే ఆఫర్‌పై డీఎంకే స్పందన ఏంటంటే..

Updated Date - May 07 , 2026 | 05:34 PM