డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:44 AM
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఘటనపై సంతాపం వెలిబుచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: బారామతి విమాన ప్రమాదం గురించి సమాచారాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్లో మాట్లాడారు.
ప్రధాని మోదీ సంతాపం
అజిత్ పవార్ అకాల మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా 'ఎక్స్' ఖాతాలో ఒక సందేశం పోస్ట్ చేశారు. 'శ్రీ అజిత్ పవార్ గారు ప్రజానాయకుడు, ఆయనకు క్షేత్రస్థాయిలో బలమైన సంబంధాలు ఉండేవి. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందుండి, కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయన ఎంతో గౌరవం తెచ్చుకున్నారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలకు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే ఆయన తపన కూడా ఎంతో ప్రశంసనీయం. ఆయన అకాల మరణం చాలా దిగ్భ్రాంతికరం.. విచారకరం. ఆయన కుటుంబానికి, లెక్కలేనంత మంది ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.' అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో పాటు, తనతో అజిత్ పవార్ ఉన్న ఫొటోలను కూడా ప్రధాని ఉంచారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన సీనియర్ NDA సహచరుడు అజిత్ పవార్ ఈరోజు జరిగిన విషాదకరమైన ప్రమాదంలో మరణించారనే వార్త నన్ను తీవ్రంగా బాధించిందని కేంద్ర హోం మంత్రి అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.