మధ్యప్రదేశ్‌లో ‘మహాకాల్ భూదోపిడీ’!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:43 AM
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం భారీ భూకుంభకోణానికి పాల్పడిందని ఆ రాష్ట్రంలోని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆయన ఆ రాష్ట్ర విద్యామంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ దందా....
ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ కుటుంబసభ్యులు భూములు కొన్న చోట అభివృద్ధి
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో సీఎం కుటుంబం?
ఇండోర్, జూన్ 26: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కుటుంబం భారీ భూకుంభకోణానికి పాల్పడిందని ఆ రాష్ట్రంలోని విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఆయన ఆ రాష్ట్ర విద్యామంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ దందా.. సీఎం అయ్యాకా కొనసాగిందని.. ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035లో భాగంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందబోయే ప్రాంతాల్లోనే వారు కొన్న భూములన్నీ ఉన్నాయని.. ఈ మెగా భూకుంభకోణం విలువ రూ.45 కోట్లని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మహాకాళేశ్వరుడి నగరమైన ఉజ్జయినిలో జరిగిన ఈ దందాను ‘మహాకాల్ భూదోపిడీ’గా అభివర్ణిస్తోంది. అయితే, బీజేపీ వర్గాలు మాత్రం.. మోహన్ యాదవ్ కుటుంబం ఎప్పట్నుంచో స్థిరాస్తి వ్యాపారంలో ఉందని, వారు భూములు కొన్న చోట్లే అభివృద్ధి ప్రాజెక్టులు రావడం కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తున్నాయి. మోహన్ యాదవ్ కుటుంబం ఉజ్జయినిలో చాలాకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఆయన గతంలో ఉజ్జయిని డెవల్‌పమెంట్ అథారిటీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఈ క్రమంలో.. 2021లో ఆయన మధ్యప్రదేశ్ విద్యామంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబసభ్యులు భూములను కొనుగోళ్ల లావాదేవీలు భారీగా పెరిగాయి. 2023 మే నెలలో.. ఆ రాష్ట్ర సర్కారు ‘ఉజ్జయిని మాస్టర్ ప్లాన్ 2035’ను విడుదల చేసింది. దానికి కొన్ని వారాల ముందు మోహన్ కుమారుడు వైభవ్, ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సావరాఖేడి అనే ప్రాంతంలో 30ఎకరాల భూములను కొనుగోలు చేసింది. అదే కాదు..ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల్లో మాస్టర్ ప్లాన్‌లో భాగమయ్యే 137 ఎకరాల భూమిని సీఎం కుటుంబసభ్యులు 2023 మే ముందే కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఆ ఏడాది మోహన్ సీఎం అయ్యాక... భూముల కొనుగోళ్ల వేగం పెరిగింది. 2024, 2025లో సీఎం కుటుంబసభ్యులు 168ఎకరాల భూమిని కొన్నారు. ఆ భూములున్న ప్రాంతాల గుండానే హైవేలు, బైపాస్ రోడ్లను నిర్మించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..