ఇస్లాంలోకి మారితే బీసీ ముస్లిం హోదా లేనట్టే!
ABN , Publish Date - Jun 27 , 2026 | 06:37 AM
వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఇస్లాంలోకి మారితే, ‘వెనుకబడిన తరగతి ముస్లిం’(బీసీఎం)లుగా వారిని పరిగణించలేమని...
వారు కేవలం ముస్లింలు అవుతారు: మద్రాస్ హైకోర్టు
చెన్నై, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్ కమ్యూనిటీలు, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు ఇస్లాంలోకి మారితే, ‘వెనుకబడిన తరగతి ముస్లిం’(బీసీఎం)లుగా వారిని పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వారిని కేవలం ముస్లింలుగానే గుర్తించడం జరుగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి 2024 మార్చి 9న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాఽథన్, జస్టిస్ పీబీ బాలాజీతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 2015లో ఇస్లాం మతంలోకి మారిన తూత్తుకుడి జిల్లావాసి పరమశివం తన పేరును సమీర్ అహ్మద్‌గా మార్చుకున్నారు. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం వెనుకబడిన తరగతి ముస్లింలుగా (బీసీఎం) గుర్తించిన ఏడు వర్గాల్లో ఒకటైన ‘ముస్లిం లబ్బే’గా తనను గుర్తిస్తూ కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు తహశీల్దార్ నిరాకరించడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం, మతమార్పిడికి ముందు నుంచే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్న వ్యక్తులు ఇస్లాంలోకి మారిన తర్వాత కూడా అలాంటి ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. బీసీ కమిషన్ సిఫారసు ఆధారంగానే ఆ జీవోను తెచ్చామని వివరించింది. ఈ వాదనతో ధర్మాసనం పూర్తిగా విభేదించింది. ‘‘ఇస్లాం మతంలోకి ఒక హిందువు మారినప్పుడు, ఆయన కేవలం ఒక ముస్లిం అవుతాడని, ముస్లిం సమాజంలో ఆయన స్థానం ఆయన పూర్వ కులంపై ఆధారపడి ఉండదని 1951లోనే మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన తీర్పుల్లో సుప్రీంకోర్టు సైతం దీనిని ఆమోదించింది.’’ అని గుర్తుచేసింది. ఆ జీవో ఏకపక్షమైనదని ఆక్షేపించింది. ఇస్లాంలోకి మారినవారు ఏదో ఒక రూపంలో రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వర్గీకరించినట్లుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ‘‘వారు (ముస్లిం వర్గాలు) హిందూమతంలోని కుల వ్యవస్థ లాంటి వారని కూడా ధైర్యంగా చెప్పవచ్చు. కులం పుట్టుకతోనే ఎలా నిర్ణయం అవుతుందో, అలాగే ఒక వ్యక్తి పుట్టుకతోనే రౌతర్, మరక్కయార్ లేదా దక్కనీ ముస్లిం అవుతాడు.
ఒకరిని రౌతర్ ముస్లింగా మతమార్పిడి చేయవచ్చని సూచించడం హాస్యాస్పదం. ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి వెనుకబడిన తరగతి ముస్లిం హోదాను పొందలేడు. ఆయన కేవలం ఒక ముస్లిం...అంతే’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి ఇస్లాం మతంలోకి మారవచ్చుగానీ, రిజర్వేషన్ల కోసం ఇస్లాంలోని ఏదైనా కులానికి లేదా వర్గానికి మారలేరని తేల్చిచెప్పింది. ‘‘ఇస్లాం ప్రధాన దైవసూత్రం సమానత్వం. సామాజిక శ్రేణిని అది అంగీకరించదు. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమే కాకుండా ఇస్లాంకు కూడా వ్యతిరేకమే. క్రైస్తవ మిషనరీలు, ఇస్లాం మత ప్రచారకులు తమ మతాలు సామాజిక సమానత్వాన్ని అందిస్తాయని, కుల వ్యవస్థ అంతర్లీన లక్షణంగా ఉన్న హిందూ మతానికి అవి భిన్నమైనవని వాదిస్తున్నారు. అలాంటి వైఖరి తీసుకున్న తరువాత, ఇస్లాంలో కూడా శ్రేణి వ్యవస్థ ఉందని చెప్పడం సరికాదు. మా అభిప్రాయం ప్రకారం, కొన్ని వర్గాలను వెనుకబడినవిగా, మిగిలినవాటిని అభివృద్ధి చెందినవిగా వర్గీకరించడం ఖురాన్ ఆదేశాలకు విరుద్ధం.’’ అని బెంచ్ తెలిపింది.
ఇవి కూడా చదవండి
విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..