Share News

Karthigai Deepam Lamp: స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..

ABN , Publish Date - Jan 06 , 2026 | 01:03 PM

తమళినాడులో తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది.

Karthigai Deepam Lamp:  స్టాలిన్ ప్రభుత్వానికి షాక్.. కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి..
Karthigai Deepam Lamp

తమిళనాడులోని తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో అధికార డీఎంకే ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు హిందువులకు అనుమతి ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్‌ సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వ వైఖరిని న్యాయమూర్తులు తప్పుబట్టారు. సింగిల్ బెంచ్ తీర్పును అమలు చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అల్లర్లు జరుగుతాయని కారణం చూపి కొండపై కార్తీక దీపం వెలిగించకుండా ఆపడం సరికాదని జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామకృష్ణన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మండిపడింది. కార్తీక దీపం వెలిగించే సమయంలో భక్తులకు పరిమితంగానే అనుమతి ఉంటుందని న్యాయమూర్తులు వెల్లడించారు. అది కూడా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వారు తెలిపారు.


కోర్టు తీర్పును పట్టించుకోని స్టాలిన్ ప్రభుత్వం

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ప్రసిద్ధ క్షేత్రాలలో మధురై సమీపంలో ఉన్న తిరుపరంకుండ్రం మొదటిది. కార్తీక మాసంలో ఇక్కడి కొండపై దీపం వెలిగించడం ఆనాదిగా వస్తున్న ఆచారం. అయితే, ఈ స్థలం గత కొంత కాలం నుంచి వివాదంలో చిక్కుకుంది. అదే కొండపై సికందర్ బాదుషా దర్గా ఉండటంతో ఆ కొండ మొత్తం వక్ఫ్ బోర్డుకు చెందినదని, అక్కడ హిందువులు దీపం వెలిగించడానికి వీల్లేదని దర్గా కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


దీంతో విషయం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌కు చేరింది. సింగిల్ బెంచ్‌ హిందువులకు సానుకూలంగా తీర్పును ఇచ్చింది. అయితే, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ స్టాలిన్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది. స్టాలిన్ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. హిందువులకు కార్తీక దీపం వెలిగించుకునే అవకాశం కల్పించింది.


ఇవి కూడా చదవండి

పూజలో ఈ తప్పులు చేస్తే ఫలితం ఉండదు.!

వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోకు గాయాలయ్యాయా.. వీడియో చూస్తే..

Updated Date - Jan 06 , 2026 | 03:36 PM