విద్యార్థుల నిరసనలు తీవ్రం.. ఎల్‌పీయూలో క్లాసుల రద్దు.. పరీక్షలు వాయిదా
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:17 AM
పంజాబ్‌లోని (ఫగ్వారా) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ నిర్వాహకులు 10 రోజుల పాటు క్లాసులను రద్దు చేశామని ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని (ఫగ్వారా) లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో (ఎల్‌పీయూ) విద్యార్థుల నిరసనలు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ నిర్వాహకులు 10 రోజుల పాటు క్లాసులను రద్దు చేశామని ప్రకటించారు. త్వరలో జరగాల్సిన మిడ్ టర్మ్ పరీక్షలను కూడా వాయిదా వేశామని వెల్లడించారు. తదుపరి పరీక్షల గురించి భవిష్యత్తులో ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థుల నిరసనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో భద్రత దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది. ఈ సమయంలో విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితో తమ స్వస్థలాలకు వెళ్లవచ్చని కూడా యూనివర్షిటీ పేర్కొంది. విద్యార్థినిపై ఓ ప్లంబర్ అత్యాచారం చేశాడన్న వార్తలతో యూనివర్సిటీలో ఆదివారం విద్యార్థులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే.
గర్ల్స్ హాస్టల్-3 వద్ద శనివారం అర్ధరాత్రి నిరసనలు మొదలైన విషయం తెలిసిందే. విద్యార్థిపై అత్యాచారం జరిగిందన్న వార్త వైరల్ కావడంతో 2 వేల మంది యూనివర్సిటీ ప్రాంగణంలో నిరసనకు దిగారు. అత్యాచారం గురించి హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 44వ జాతీయ రహదారిని కూడా దిగ్బంధించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నిరసనల్లో మంటలు చెలరేగి ఐదు పోలీసు వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. విద్యార్థుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుపై దర్యాప్తు కోసం సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
గుజరాత్‌లో బోగస్ ఎన్నికల విరాళాల రాకెట్