ఏపీలో దిగుడు బావుల పునరుద్ధరణ
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:26 AM
అక్టోబరు 2న గాంధీ జయంతిని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 138వ సంచికలో ప్రస్తావించారు.
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ వెల్లడి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 2న గాంధీ జయంతిని ప్రస్తావిస్తూ.. దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 138వ సంచికలో ప్రస్తావించారు. ‘గాంధీజీ జీవన విలువలు, పారిశుధ్యం గురించి ప్రబోధించారు. ఇటీవల పారిశుధ్య కార్యక్రమాలు స్ఫూర్తి నింపుతున్నాయి. వాటి ఫొటోలు, వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పాత దిగుడుబావులు, బావులను యువత శుద్ధి చేస్తున్నారు. ప్రాచీన సంస్కృతి, వారసత్వాల పునరుద్ధరణకు తోడ్పడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో యువకులు ఓ నది ప్రక్షాళనకు నడుం బిగించారు. యావత్ సమాజం వారికి అండగా నిలుస్తోంది. ముంబైలో కొందరు యువకులు బీచ్‌లను శుభ్రం చేయడానికి సంకల్పించారు. ప్రతి వారం వందల మంది యువ మిత్రులు ఏదో ఒక బీచ్ వద్దకు వెళ్లి ‘స్వచ్ఛతా సే సేవ’ పారిశుధ్య డ్రైవ్ చేపడుతున్నారు. ఢిల్లీలో పిల్లలు, యువకులు చెత్త వ్యర్థాల విభజనను ప్రచారం చేస్తున్నారు. ఇరుగుపొరుగు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో పిక్నిక్ ప్రాంతాల్లో మార్కెట్ ఏరియాల ప్రక్షాళనకు యువ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తున్నారు’ అని వివరించారు. పర్యావరణం, అరుదైన జంతుజాతుల పరిరక్షణను మోదీ ప్రస్తావించారు. ఒకప్పుడు అస్సాంలో అటవీప్రాంతాలు జనాక్రమణలో ఉండడంతో ఏనుగులు పెద్దసంఖ్యలో సొనాయ్‌రూపాలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చేవని.. గత మూడేళ్లలో ఆక్రమణలు తొలగించడంతో ఏనుగుల గుంపులు తిరిగి అడవుల్లోకి వెళ్లిపోయానని చెప్పారు. అస్సాంలోనే అరుదైన ‘పిగ్మీ హాగ్’ జంతువుల సంరక్షణకు చేపట్టిన చర్యలను తెలియజేశారు. వీటితో గతంలో ఆరు మాత్రమే ఉన్న ఈ జంతువుల జనాభా ఇప్పుడు 190కి పెరిగిందన్నారు.
‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ను మోదీ ప్రస్తావించారు. వెయ్యేళ్ల కిందట 1026లో మహమ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై మొదటిసారి దాడిచేశాడని గుర్తుచేశారు. సోమనాథ్‌ను నాశనం చేసి భారతదేశ గుర్తింపును చెరిపేయడానికి వచ్చినవారెవరూ ఉనికిలో లేకుండా పోయారని చెప్పారు.