గుజరాత్‌లో బోగస్ ఎన్నికల విరాళాల రాకెట్
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:16 AM
రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ‘బోగస్ డొనేషన్’ రాకెట్ గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా..
విరాళాల పేరిట భారీగా పన్ను ఎగవేత
3పార్టీలకు రూ.1,870 కోట్ల విరాళాలు
ఇందులో 10శాతం కమీషన్‌గా ఉంచుకొని మిగిలినది తిరిగి దాతలకు వాపస్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: రాజకీయ పార్టీలకు విరాళాల పేరిట ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ‘బోగస్ డొనేషన్’ రాకెట్ గుజరాత్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు ఆధారంగా గుజరాత్ క్రైమ్ పోలీసులు నమోదిత గుర్తింపు లేని మూడు రాజకీయ పార్టీలు, ఆఫీస్ బేరర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రూ.560 కోట్ల మేర ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపించారు. భారతీయ నేషనల్ జనతాదళ్ (బీఎన్‌జేడీ)కి చెందిన నలుగురు, స్వతంత్ర అభివ్యక్తి పార్టీకి చెందిన ముగ్గురు, గరీబ్ కల్యాణ్ పార్టీకి చెందిన ఎనిమిది మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నిజానికి ఈ మూడు పార్టీలు ఎన్నికల సంఘం వద్ద నమోదైనవే. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. కానీ, భారీగా విరాళాలు సేకరిస్తుండడంతో సందేహం వచ్చి, ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది. ఏడాదిపైగా పరిశీలన చేయడంతో వీటి మోసం బయటపడింది. ఆదాయపన్ను చట్టం ప్రకారం రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై 100శాతం పన్ను మినహాయింపు ఉంది. దీన్ని అనుకూలంగా మలుచుకుని, పెద్ద మొత్తంలో విరాళాల స్కామ్ నడిపించినట్లు గుర్తించారు. ఈ మూడు పార్టీలు విరాళాల రూపంలో రూ.1,870 కోట్లను సేకరించాయి. వాటిల్లో 4-10 శాతం మేర కమీషన్ కింద మినహాయించుకుని.. మిగిలిన మొత్తాన్ని తిరిగి ఆయా దాతలకే చెల్లించాయి. దీంతో, దాతలు ఆ మొత్తం డబ్బుపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకున్నారు.