Share News

11 ఏళ్ల బాలుడిని బలి తీసుకున్న సింహం.. గుజరాత్‌లో దారుణం

ABN , Publish Date - Jul 11 , 2026 | 10:39 PM

సింహం దాడిలో ఓ 11 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన గుజరాత్‌లో తాజాగా వెలుగుచూసింది.

11 ఏళ్ల బాలుడిని బలి తీసుకున్న సింహం.. గుజరాత్‌లో దారుణం
Gujarat lion attack

ఇంటర్నెట్ డెస్క్: సింహం దాడిలో ఓ 11 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన గుజరాత్‌లో తాజాగా వెలుగుచూసింది. గిర్‌నార్ పర్వత్రంపై దేవాలయానికి మెట్ల దారిలో వెళుతున్న ఓ కుటుంబంపై దాడి చేసిన సింహం బాలుడిని ఈడ్చుకెళ్లిపోయింది. 50వ మెట్టు వద్ద ఈ డాది జరిగింది. వెంటనే అటవీ శాఖా అధికారులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి శరీర భాగాలు ఘటన స్థలానికి 100 మీటర్ల దూరంలో లభించాయి. ఘటన జరిగిన నాలుగు గంటలకు ఓ సింహాన్ని అటవీ శాఖ సిబ్బంది బంధించారు. ఇదే సింహం పిల్లాడిని చంపి తిన్నట్టు నిర్ధారించారు. ఆ ప్రాంతంలోని మరో రెండు సింహాలను కూడా ముందు జాగ్రత్త చర్యగా బంధించి జూకు తరలించారు.


తొలుత చిక్కిన ఒక సింహం పరీక్షల సందర్భంగా వాంతి చేసుకోవడంతో మానవ అవశేషాలు బయటపడ్డాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీంతో, అదే చిన్నారిపై దాడి చేసిందని నిర్ధారించామని అన్నారు. మిగిలిన రెండు సింహాలను కూడా పరీక్షిస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలానికి సమీపంలో లభించిన మానవ శరీర భాగాలను కూడా సేకరించి పరీక్షల నిమిత్తం తరలించారు. బాధిత కుటుంబం ఖేడా జిల్లా మోదజ్ గ్రామానికి చెందినదని చెప్పారు. ఘటన నేపథ్యంలో మెట్ల మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.

జునాగఢ్ జిల్లాలోని గిర్‌నార్ పర్వత ప్రాంతాలు ఆధ్యాత్మిక క్షేత్రాలుగా విలసిల్లుతున్న విషయం తెలిసిందే. అక్కడ పలు జైన, హిందూ దేవాలు ఉన్నాయి. ముఖ్యంగా అంబాజీ ఆలయం, దత్తాత్రేయ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దాదాపు 10 వేల మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటారు.


ఈ వార్తలను చదవండి:

బిహార్‌లో 3,035 మంది ప్రభుత్వ టీచర్ల తొలగింపు!

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

Updated Date - Jul 11 , 2026 | 10:53 PM