Share News

చట్టసభలా? ప్రాథమిక హక్కులా?

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:25 AM

ఒక పత్రికలో వచ్చిన వార్త నచ్చలేదని అసెంబ్లీ స్పీకర్‌ జర్నలిస్టులకు సమన్లు, వారెంట్లు జారీ చేయవచ్చా? చట్టసభలకు ఉన్న ప్రత్యేక హక్కులు(ప్రివిలేజెస్‌) రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ కంటే మించినవా? దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక ప్రశ్నపై సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం(6వ తేదీ) నుంచి విచారణ ప్రారంభించనుంది.

చట్టసభలా?  ప్రాథమిక హక్కులా?
SUPREMECOURT

  • రెంటి మధ్య వివాదంలో ఎవరిమాట చెల్లుబాటు?

  • తేల్చనున్న సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం

  • ఈ నెల 6 నుంచి విచారణ

న్యూఢిల్లీ, అక్టోబరు 1: ఒక పత్రికలో వచ్చిన వార్త నచ్చలేదని అసెంబ్లీ స్పీకర్‌ జర్నలిస్టులకు సమన్లు, వారెంట్లు జారీ చేయవచ్చా? చట్టసభలకు ఉన్న ప్రత్యేక హక్కులు(ప్రివిలేజెస్‌) రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ కంటే మించినవా? దాదాపు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక ప్రశ్నపై సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం(6వ తేదీ) నుంచి విచారణ ప్రారంభించనుంది. ఈ కేసులో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ మానవ హక్కుల సంస్థ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీ్‌స(పీయూసీఎల్‌), మాజీ ఎంపీ సుభాషిణి అలీ, జర్నలిస్టు నరేంద్రనాథ్‌ మిశ్రా బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చట్టసభ హక్కులు ఎంతవరకు ఉంటాయి? వాటిని పౌరులపై ప్రయోగించినపుడు కోర్టులు సమీక్షించవచ్చా? అన్న ప్రశ్నలు అసాధారణ ప్రజా ప్రాధాన్యం ఉన్నవని పీయూసీఎల్‌ తన పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని 105, 194 అధికరణలు పార్లమెంటు, అసెంబ్లీలకు ప్రత్యేక హక్కు లు ఇస్తున్నాయి. 14(సమానత్వం), 19(1)(ఎ)(భావ ప్రకటన స్వేచ్ఛ), 21(జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ) అధికరణలు పౌరులకు ప్రాథమిక హక్కులను కల్పిస్తున్నాయి. రెండింటికీ మధ్య సంబంధం ఏమిటన్నదే అసలు ప్రశ్న అని పీయూసీఎల్‌ తెలిపింది. పత్రికల్లో వార్తలు రాసిన జర్నలిస్టులపై ప్రివిలేజ్‌ అస్త్రం ప్రయోగించి, సమన్లు, వారెంట్ల వంటి బలవంతపు చర్యలు తీసుకున్న ఉదంతాలను ప్రస్తావించింది. న్యాయవాది ఆర్తి రాజన్‌ ద్వారా పీయూసీఎల్‌ ఈ పిటిషన్‌ వేసింది.


ఈ కేసు ఫలితం కేవలం కక్షిదారులకే పరిమితం కాదని, జర్నలిస్టులు, ప్రచురణకర్తలు, పరిశోధకులు, పౌర సమాజ సంస్థలు, చట్టసభల వ్యవహారాలపై బహిరంగంగా చర్చించే ప్రతీ పౌరుడిపైనా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్దేశించే సూత్రాలు ప్రజాస్వామ్య చర్చపైనా, పౌరుల భాగస్వామ్యంపైనా వ్యవస్థాగతంగా ప్రభావం చూపుతాయని పేర్కొంది. జర్నలిస్టులు అజిత్‌ అంజుమ్‌, సీమా చిస్తీ, స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా తమను కూడా చేర్చుకోవాలని పిటిషన్లు వేశారు.

2003 నాటి కేసు

హిందూ పత్రిక జర్నలిస్టులు ఎన్‌.రవి, మరో ఐదుగురు జర్నలిస్టులను అరెస్టు చేయాలని అప్పటి తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ కె.కాళిముత్తు ఆదేశించారు. దీనిపై జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే విధించింది. ఈ కేసులో సుప్రీంకోర్టే రెండు భిన్న తీర్పులు ఇచ్చింది. అధికారిక నిర్ణయం కోసం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ఇందులో ఆర్టికల్‌ 194(3), 19(1)(ఎ), వాటి మధ్య సంబంధం, ఆర్టికల్‌ 21 వ్యాఖ్యానానికి సంబంధించిన కీలకమైన న్యాయ ప్రశ్నలు ఇమిడి ఉన్నాయని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 02:07 AM