Share News

కువైట్‌లో చమురు ఉత్పత్తి బంద్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 04:50 AM

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో చమురు ఉత్పత్తిని, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లుగా కువైట్‌ శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఖతర్‌, ఇరాక్‌ ఈ ప్రకటన చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌లో...

కువైట్‌లో చమురు ఉత్పత్తి బంద్‌

ఇప్పటికే నిలిపేసిన ఖతర్‌, ఇరాక్‌.. మార్కెట్‌లో ప్రకంపనలు!

బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా భారత్‌పై వేల కోట్ల భారం

అరేబియా సముద్రంలో స్తంభించిన నౌకాయానం

ఎర్ర సముద్రం మీదుగా సరఫరాకు సౌదీతో భారత్‌ ఒప్పందం

అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో చమురు ఉత్పత్తిని, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లుగా కువైట్‌ శనివారం ప్రకటించింది. ఇప్పటికే ఖతర్‌, ఇరాక్‌ ఈ ప్రకటన చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు మార్కెట్‌లో తీవ్ర ప్రకంపనలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రంలో హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ దిగ్బంధించడంతో నౌకాయానం స్తంభించిపోయి పలు దేశాల్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చమురు ఉత్పత్తే నిలిచిపోతే పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. దీని ప్రభావం భారత్‌ మీద కూడా గణనీయంగా ఉండనుంది. బ్యారెల్‌కు కేవలం ఒక్క డాలర్‌ పెరిగినా భారత్‌పై రూ.16 వేల కోట్ల అదనపు భారం పడుతుందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే, ఉద్రిక్తతలు నెలకొన్న అరేబియా సముద్రం కాకుండా.. ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ నుండి చమురు కొనుగోలు చేయడానికి సౌదీ అరేబియాతో భారత్‌ ఒప్పందం చేసుకుంది. రష్యా చమురు, గ్యాస్‌ కూడ ఇదే ఎర్ర సముద్రం మార్గం గుండా భారత్‌కు చేరుకొంటుంది. వివిధ దేశాలకు చెందిన ఎల్‌పీజీ ట్యాంకర్లతోపాటు దాదాపు 600 నౌకలు ప్రస్తుతం గల్ఫ్‌ దేశాలలో నిలిచిపోయాయి. వీటిలో 32 లక్షల (14.2 కిలోల) సిలిండర్లకు సరిపడా గ్యాస్‌ రవాణా చేసే శివలిక్‌ నౌక కూడా ఉంది. ఇది ఖతర్‌లో ఆగిపోయింది. ఇది భారతదేశంలో అత్యధిక సామర్థ్యం కలిగిన ఎల్‌పీజీ రవాణా నౌక. హొర్ముజ్‌ జలసంధి మీదుగా సాధారణంగా నిత్యం 170నౌకలు వెళ్తుండగా యుద్ధం వల్ల వాటి సంఖ్య రెండుకు పడిపోయింది. యుద్ధం కొనసాగితే మరికొన్ని వారాలలోపు చమురు ధర బ్యారెల్‌కు 150 డాలర్లకు చేరుకోవచ్చని ఖతర్‌ ఇంధన మంత్రి సాద్‌ అల్‌ కాబీ చేసిన వ్యాఖ్యాలతో ప్రపంచ మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి. శనివారం చమురు ధర బ్యారెల్‌కు 94 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన వారం రోజుల్లోనే చమురు ధరలు 30 శాతం పెరగటం గమనార్హం. ఎల్‌పీజీ అవసరాలకు భారత్‌ ప్రధానంగా సౌదీ, ఖతర్‌లపై ఆధారపడుతుండగా ఈ దేశాల్లో ఎల్‌పీజీ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శనివారానికి ఎల్‌పీజీ ధర టన్నుకు 750డాలర్లకు చేరుకుంది. ఎల్‌ఎన్‌జీ ధర 35డాలర్లకు చేరుకుంది.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 04:50 AM