Share News

కుప్పం విమానాశ్రయ భూసేకరణకు పచ్చజెండా

ABN , Publish Date - May 01 , 2026 | 06:05 AM

చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణను సవాల్‌ చేస్తూ...

కుప్పం విమానాశ్రయ భూసేకరణకు పచ్చజెండా

  • 8 హైకోర్టు తీర్పులో జోక్యానికి నిరాకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కుప్పం విమానాశ్రయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. కుప్పం విమానాశ్రయం కోసం సుమారు 150 ఎకరాల భూసేకరణ చేస్తూ జిల్లా కలెక్టర్‌ జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లు చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విమానాశ్రయం అనేది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశమని, భూసేకరణను నిలిపివేయడం కుదరదని హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ చక్రధర్‌ రెడ్డితో పాటు మరో 29 మంది ఏప్రిల్‌ 16న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. భూమి అనుకూలతపై సరైన ఆధారాలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ సాగుతోందని వాదించారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న ఇతర అనుబంధ దరఖాస్తులన్నింటినీ పరిష్కరించినట్లు పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:05 AM