Share News

నచ్చినప్పుడు మాతృత్వం

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:44 AM

వయసు మీద పడుతోంది. మరోవైపు కెరీరేమో మంచి దశలో ఉంది. పెళ్లి, పిల్లలు.. ఇప్పుడు ఈ బాధ్యతలు తలెత్తుకుంటే.. కెరీర్‌ కుంటుపడుతుంది. దీనికి పరిష్కారం.. ఎగ్‌ ఫ్రీజింగ్‌...

నచ్చినప్పుడు మాతృత్వం

  • అండాల నిల్వకు సెలబ్రిటీల మొగ్గు

  • తానూ చేశానన్న కృతిసనన్‌

ముంబయి, జూలై 7: వయసు మీద పడుతోంది. మరోవైపు కెరీరేమో మంచి దశలో ఉంది. పెళ్లి, పిల్లలు.. ఇప్పుడు ఈ బాధ్యతలు తలెత్తుకుంటే.. కెరీర్‌ కుంటుపడుతుంది. దీనికి పరిష్కారం.. ఎగ్‌ ఫ్రీజింగ్‌. నేటి కాలం యువతులు ముఖ్యంగా వినోద రంగంలో ఉన్న పలువురు దీనికి మొగ్గు చూపుతున్నారు. దీనిద్వారా బయోక్లాక్‌ (జీవ గడియారం) కలిగించే ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుందని చెబుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ.. ప్రముఖ హీరోయిన్‌ కృతి సనన్‌. తాను కూడా అండాలను నిల్వ చేసుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 35 ఏళ్ల కృతి సనన్‌ వెల్లడించారు. మిమి సినిమాలో అద్దెగర్భానికి సిద్ధమైన తల్లి పాత్రలో నటించటానికి ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభించటానికి ముందు తనను 15 కిలోల బరువు పెరగాలని దర్శకుడు కోరారని.. దీంతో, అండాలు దాచుకోవటానికి(ఎగ్‌ ఫ్రీజింగ్‌కు) ఇదే సరైన సమయం అనిపించిందన్నారు. కెరీర్‌ మీద దృష్టి పెట్టిన మహిళలకు గర్భధారణ వయసు దాటిపోతున్న సందర్భాలు ఉంటున్నాయి కదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వివరాలు వెల్లడించారు. ‘పెళ్లయినా, పిల్లలైనా మనసుకు నచ్చినప్పుడే ఆ పని చేయాలి తప్ప.. ఏదో ఒక ఒత్తిడితోనో, వయసు పెరిగిపోతోందనే చేయవద్దు. అందుకనే అండాలను నిల్వ చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని ఆమె చెప్పారు. మాజీ మిస్‌ వరల్డ్‌ డయానా హైడెన్‌ 2008లో అండాలను నిల్వ చేసుకొని అప్పట్లో సంచలనం సృష్టించారు. ఆ రోజుల్లో ఇది కొత్త వైద్య ప్రక్రియ. 8 ఏళ్ల తర్వాత హైడెన్‌ ఆ అండాలను ఉపయోగించుకొని కూతురికి జన్మ ఇచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 06:44 AM