మోదీ ప్రకటనల ఖర్చే 5,987 కోట్లు
ABN , Publish Date - May 14 , 2026 | 05:37 AM
సామాన్యులకు పొదుపు పాఠాలు చెప్పే ప్రధాని మోదీ... తన సొంత డబ్బా కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు....
చెప్పేవి పొదుపు పాఠాలు.. చేసేవి ప్రచార ఆర్భాటాలు: ఖర్గే
న్యూఢిల్లీ, మే 13 (ఆంధ్రజ్యోతి): సామాన్యులకు పొదుపు పాఠాలు చెప్పే ప్రధాని మోదీ... తన సొంత డబ్బా కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ పొదుపు సూత్రాలపై బుధవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని ఖర్గే మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పింఛన్లను ఒక్క పైసా కూడా పెంచకుండా వారిని వంచిస్తోందని అన్నారు. దేశంలో పెరిగిన ధరల దృష్ట్యా ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర పింఛను సొమ్ముతో కనీసం మందులు, ఆహారం కూడా కొనుక్కోలేని స్థితిలో వృద్ధులు ఉన్నారని అన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి 45ు క్షీణించిన తర్వాత... రూ.200 పింఛను విలువ దాదాపు రూ.110తో, రూ.300 పింఛను రూ.165తో, రూ.500 పింఛను రూ.275తో సమానమని వివరించారు. పేదల పింఛన్లు పెంచడానికి మనసు రాని ఈ బుద్దిలేని ప్రభుత్వం.. ప్రచారానికి మాత్రం కోట్లు ఖర్చు చేస్తోందని మండిపడ్డారు. 2014-15, 2024-25 మధ్య బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసమే ఏకంగా రూ.5,987.46 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. ‘‘కోట్లాది మంది వృద్ధులు చాలీచాలని పింఛనుతో ఆకలితో, అనారోగ్యంతో అలమటిస్తుంటే.. మోదీ ప్రభుత్వం మాత్రం ఆర్భాటపు ఎన్నికల ప్రచారాలు, భారీ కాన్వాయ్‌లు, అట్టహాసమైన కార్యక్రమాలు, నాన్‌స్టాప్ పబ్లిసిటీతో కాలక్షేపం చేస్తోంది. తన క్రూరమైన విధానాలతో పేదల ఆర్థిక గౌరవాన్ని హరించివేస్తోంది’’ అని ఖర్గే అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్