‘కుంభమేళా మోనాలిసా’ మేజర్!
ABN , Publish Date - Jun 04 , 2026 | 06:12 AM
కుంభమేళా మోనాలిసాగా పేరుగాంచిన యువతి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్త...
ధ్రువపత్రాల ఆధారంగా కేరళ హైకోర్టు స్పష్టీకరణ.. ఆమె భర్తకు ట్రాన్సిట్ బెయిల్
కొచి, జూన్ 3: కుంభమేళా మోనాలిసాగా పేరుగాంచిన యువతి ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్త మహమ్మద్ ఫర్మాన్‌కు బుధవారం నెల రోజుల ట్రాన్సిట్ బెయిల్‌ను మంజూరు చేసింది.బర్త్ సర్టిఫికెట్, ఓటరు కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ల ద్వారా.. యువతి పుట్టినతేదీ 2008 జనవరి 1 అని తెలుస్తోందని, తద్వారా ఆమెను మేజర్‌గానే భావించవచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, కేరళకు చెందిన ఫర్మాన్ ఈ ఏడాది ప్రారంభంలో కేరళలో వివాహం చేసుకున్నారు. అయితే, మోనాలిసా మైనర్ అని, ఆమెను అపహరించుకువెళ్లాడంటూ ఫర్మాన్ మీద ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు అరెస్టు చేయకుండా బెయిల్ మంజూరు చేయాలని ఫర్మాన్, ఆయన భార్య కేరళ హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ పోలీసుల తరఫున భారత అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎ్‌సజీఐ) ఎస్ వీ రాజు వాదనలు వినిపిస్తూ.. యువతి మైనర్ అని, కోర్టుకు ఆమె సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రం ఫోర్జరీదన్నారు. హిందూ ఇస్లాం మతాలకు చెందిన వారిద్దరి పెళ్లి కేరళలో ఒక ఆలయంలో జరిగింది కాబట్టి, ఆ వివాహం చెల్లదని, దానిని స్థానిక రిజిస్ట్రార్ నమోదు చేసి వివాహ సర్టిఫికేట్ జారీ చేయటం కూడా చెల్లదన్నారు. ఫర్మాన్‌కు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదన్నారు. ఏఎ్‌సజీఐ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. ఫర్మాన్ విజ్ఞప్తిని ఆమోదిస్తూ.. జూన్ 3వ తేదీ నుంచి నెలరోజులపాటు ట్రాన్సిట్ బెయిల్‌ను మంజూరు చేస్తున్నామని, ఆలోపు మధ్యప్రదేశ్‌లోని కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చన్నారు. ఈ నెలరోజుల్లో అతడిని అరెస్టు చేయటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. వాదనల సందర్భంగా ఫర్మాన్, ఆయన భార్యను ఉద్దేశించి ‘మీరు అదృష్టవంతులు.. కేరళలో ఉన్నారు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించగా.. దానికి వారు బదులిస్తూ.. దానివల్లే తాము ఇంకా జీవించి ఉన్నామని చెప్పటం విశేషం.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..