Share News

కుంభమేళా మోనాలిసా పిటిషన్.. పోలీసులకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:15 PM

‘కుంభమేళా గర్ల్’ మోనాలిసా‌కు భద్రత కల్పించటంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆదేశించింది.

కుంభమేళా మోనాలిసా పిటిషన్.. పోలీసులకు కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు..
Kumbh Mela Girl

తిరువనంతపురం, జూన్ 20: ‘కుంభమేళా గర్ల్’ మోనాలిసా‌కు భద్రత కల్పించటంపై కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మోనాలిసా, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్‌కు భద్రత కల్పించాలంటూ పోలీసులను ఆదేశించింది. ఆ వివరాల్లోకి వెళితే.. మోనాలిసా, మొహమ్మద్ ఫర్మాన్‌‌కు ఆన్‌లైన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి.. మార్చి 11వ తేదీన తిరువనంతపురంలోని అరుమనూర్‌ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మోనాలిసా వయసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు మొదలయ్యాయి.


ఫర్మాన్ తన కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని మోనాలిసా తండ్రి మధ్యప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌’కు ఫిర్యాదు కూడా వెళ్లింది. ‘నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌’ మోనాలిసా వయసుపై దర్యాప్తు చేయగా.. ఆమె మైనర్ అని తేలింది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ దర్యాప్తులో బయటపడ్డ విషయాల మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద మోనాలిసా భర్తపై కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. అతడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు.


కేరళ హైకోర్టు ఫర్మాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయకుండా స్టే విధించింది. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ కేరళలోనే ఉంటున్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కొద్దిరోజుల క్రితం మోనాలిసా కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. మతాంతర వివాహం కారణంగా మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు వ్యక్తుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని మోనాలిసా తన పిటిషన్‌లో పేర్కొంది. తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వానికి, ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.


శనివారం మోనాలిసా పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. మోనాలిసా తరఫు న్యాయవాదితో పాటు ప్రభుత్వ ప్లీడర్ వాదనలను విన్న కోర్టు.. పిటిషనర్ ప్రాణానికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని భావించింది. రిట్ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకు మోనాలిసా, ఆమె భర్తకు రక్షణ కల్పించాలని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 10వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఐఏఎస్ అధికారి

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 1-డే కౌంట్‌డౌన్ ఈవెంట్

Updated Date - Jun 20 , 2026 | 01:39 PM