ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్సింగ్.. 4 రోజుల తర్వాత శవమై తేలిన బాలిక..
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:52 AM
కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్ అయిన కేరళ బాలిక శ్రీనంద శవమై కనిపించింది. మాణిక్యధార వ్యూపాయింట్ దగ్గర 1500 అడుగుల కింద శ్రీనంద శవాన్ని అధికారులు గుర్తించారు.
బెంగళూరు, ఏప్రిల్ 11: కర్ణాటకలోని చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లి మిస్ అయిన కేరళ బాలిక శ్రీనంద శవమై కనిపించింది. మాణిక్యధార వ్యూపాయింట్ దగ్గర 1500 అడుగుల కింద శ్రీనంద శవాన్ని అధికారులు గుర్తించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 14 ఏళ్ల శ్రీనంద పదవ తరగతి చదువుతోంది. నాలుగు రోజుల క్రితం 40 మంది కుటుంబసభ్యులతో కలిసి కర్ణాటక ట్రిప్‌కు వచ్చింది. మొదట అందరూ కలిసి హంపీ వెళ్లారు. అక్కడినుంచి ఏప్రిల్ 7వ తేదీన చిక్కమంగళూరు వచ్చారు.
మధ్యాహ్నం చంద్రద్రోణ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఆరు గంటల సమయంలో చీకటి పడ్డ తర్వాత శ్రీనంద కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా లాభం లేకుండాపోయింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనందను చివరగా మాణిక్యధార ప్రాంతంలో చూశామని చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనంద మిస్సింగ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాలిక తల్లిదండ్రులు.. ‘మా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు’అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర మాట్లాడుతూ.. ‘బాలిక కిడ్నాప్ అయిందని కొంతమంది.. ఆమె ఎవరి వెంటో వెళ్లిందని మరికొంతమంది అంటున్నారు. ఆమె ఎక్కడుందో తెలిస్తే కానీ, ఏం జరిగిందో తెలియదు’ అని అన్నారు.
అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ వేగవంతం చేశారు. థర్మల్ కెమెరాలు, డ్రోన్ల సాయంతో బాలిక కోసం అన్వేషించారు. నాలుగు రోజుల తర్వాత విషాదం వెలుగుచూసింది. మాణిక్యధార వ్యూపాయింట్ దగ్గర 1500 అడుగుల కింద శ్రీనంద శవం కనిపించింది. పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం రిపోర్టు వస్తే ఆమె చావుకు కారణం ఏంటన్నది తెలుస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక, పోలీసులు బాలిక తల్లిదండ్రుల ఫోన్లు సీజ్ చేశారు. కుటుంబసభ్యులందరినీ విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మనీ ప్లాంట్ ఈ దిశలో ఉంటే ఆర్థిక నష్టం
అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. పేదల జోలికెళ్లకుండా చర్యలు..