Share News

కేరళ, అస్సాం అసెంబ్లీలకు నేడే పోలింగ్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:41 AM

కేరళ, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం పూర్తి కానుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా...

కేరళ, అస్సాం అసెంబ్లీలకు నేడే పోలింగ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: కేరళ, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ గురువారం పూర్తి కానుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కూడా గురువారమే జరగనుంది. కర్ణాటక, నాగాలాండ్‌, త్రిపుర రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను కూడా ఈ రోజే నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కేరళలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని, చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు సాధించాలని బీజేపీ పోరాడుతోంది. కేరళలో పదేళ్లుగా ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉంది. దీంతో, సహజంగానే ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది. కానీ, తమ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో ప్రజలు ఈసారి కూడా తమకే అధికారాన్ని కట్టబెడతారని సీఎం విజయన్‌ భావిస్తున్నారు. కానీ, ఇటీవల కొన్ని సర్వేలు యూడీఎఫ్‌ వైపు మొగ్గు ఉందని వెల్లడించాయి. కేరళలో మొత్తం 140అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 883మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.71కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ఉదయం 7గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6గంటలకు ముగుస్తుంది. ఇక అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌పై ధీమాగా ఉంది. సర్వేలు కూడా అస్సాంలో ఎన్డీయేదే అధికారం అని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉంది. మొత్తం 722మంది బరిలో ఉన్నారు. 2.50కోట్ల మంది ఓటు వేయనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు 294మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 9.5లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ ఆల్‌ ఇండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రె్‌స-డీఎంకే కూటమి మధ్య పోటీ ఉంది. ఇదిలా ఉండగా, కర్ణాటకలో దావణగెరె సౌత్‌, బాగల్కోట్‌.. నాగాలాండ్‌లోని కోరిడాంగ్‌, త్రిపురలో ధర్మనగర్‌ స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఎమ్మెల్యేల మరణం కారణంగా ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలతో పాటు ఈ నాలుగు స్థానాల ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. గోవాలోని పోండా నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరగాల్సి ఉండగా బాంబే హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గోవాలో కొన్ని నెలల్లోనే(ఏడాది లోపు) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఒక్క స్థానానికి ఉప ఎన్నిక అక్కర్లేదని బాంబే హైకోర్టు భావించి, ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:41 AM