Share News

ఆప్‌పై మోదీ, అమిత్‌ షా కుట్ర

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:47 AM

ఢిల్లీ మద్యం కేసు పేరుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని అంతం చేసేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కలిసి కుట్ర పన్నారని ఆ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు...

ఆప్‌పై మోదీ, అమిత్‌ షా కుట్ర

  • మేం అవినీతిపరులం కాదని కోర్టు కూడా చెప్పింది

  • దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి

  • దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి

  • బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే..

నేను రాజకీయాల నుంచి తప్పుకొంటా: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మద్యం కేసు పేరుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని అంతం చేసేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా కలిసి కుట్ర పన్నారని ఆ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ‘‘ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చర్య స్వతంత్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ జరగలేదు. మాపై తప్పుడు కేసుతో బురద చల్లారు. నేను అవినీతిపరుణ్ని కాదు. కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోడియా నిజాయితీపరులని కోర్టు కూడా చెప్పింది. ఆప్‌ను అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షా కలిసి అతిపెద్ద రాజకీయ కుట్రకు పాల్పడ్డారు. మా పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను కూడా తీసుకెళ్లి జైల్లో వేశారు. బీజేపీ దర్యాప్తు సంస్థలు మమ్మల్ని అవినీతిపరులుగా నిరూపించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. కేజ్రీవాల్‌, సిసోడియా అత్యంత నిజాయతీపరులు (కట్టర్‌ ఇమాన్‌దార్‌) అని నిరూపితమైంది. మాపై పెట్టింది తప్పుడు కేసుగా కోర్టు స్పష్టం చేసినందున దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రావడానికి మాపై తప్పుడు కేసులు పెట్టి.. 3కోట్ల మంది ఢిల్లీ ప్రజలను కూడా మోసం చేశారు. మోదీకి దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. బీజేపీకి 10 సీట్ల కన్నా ఎక్కువ వస్తే నేను రాజకీయాల్లో నుంచి తప్పుకొంటా. ఆప్‌ లాంటి పార్టీలను ధ్వంసం చేసేందుకు కుట్రలు చేయడం మానుకొని.. దేశ ప్రయోజనాల కోసం పనిచేయడంపై మోదీ, అమిత్‌ షా దృష్టి పెట్టాలి. జీవితంలో నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. నేను అవినీతిపరుణ్ని కాదు’’ అని కేజ్రీవాల్‌ కంటతడి పెట్టారు.

ఈ వార్తలూ చదవండి

ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ

కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ

Updated Date - Feb 28 , 2026 | 05:47 AM