కేరళ సీఎం వేణుగోపాల్?
ABN , Publish Date - May 09 , 2026 | 06:12 AM
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు...
కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆయన వైపే!
ఖర్గేకు పార్టీ పరిశీలకుల నివేదిక
11న ప్రమాణ స్వీకారం?
రేసులో సతీశన్, చెన్నితల
మిత్రపక్షాల ఓటు సతీశన్‌కే
తిరువనంతపురం/న్యూఢిల్లీ, మే 8: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో గురువారం తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్‌కే ఓటేసినట్లు తెలిసింది. పరిశీలకులు శుక్రవారం ఢిల్లీలో ఖర్గేకు తమ నివేదిక సమర్పించారు. అంతా సాఫీగా జరిగితే 11న(సోమవారం) వేణుగోపాల్ సీఎంగా పదవీప్రమాణం చేస్తారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇదంత తేలికగా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. గత ఐదేళ్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీశన్.. అంతకుముందు ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న రమేశ్ చెన్నితల సీఎం కుర్చీ ఆశిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో 140 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ వాటా 63. ఐయూఎంఎల్(22), కేరళ కాంగ్రెస్(7) సహా మిగతా మిత్రపక్షాలు 39 సీట్లు గెలుచుకున్నాయి. సీఎల్పీ భేటీలో 63 మంది ఎమ్మెల్యేల్లో 43 మంది వేణుగోపాల్ వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. ఈలోపు సతీశన్ వర్గీయులు రోడ్లెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు దిగారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అటు వేణుగోపాల్ మద్దతుదారులు పీసీసీ కార్యాలయం ముందు సీఎం వేణుగోపాల్ అంటూ భారీ ఫ్లెక్సీలే పెట్టేశారు. ఇతరుల క్యాబినెట్‌లో తాను చేరనని.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేదీ తీసుకోనని.. సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటానని సతీశన్ అధిష్ఠానానికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. మిత్రపక్షాలు సైతం ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నాయి.
సోనియాగాంధీకి సన్నిహితుడిగా పేరున్న చెన్నితల చాపకింద నీరులా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. దీంతో సతీశన్, చెన్నితలకు అధిష్ఠానం నచ్చజెబుతున్నట్లు తెలిసింది. మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు జరిపాకే సీఎం అభ్యర్థిని ప్రకటించి 11న ప్రమాణ స్వీకారం చేయించాలని భావిస్తోంది. మధ్యేమార్గంగా మాజీ సీఎం కరుణాకరన్ కుమారుడు కె.కరుణాకరన్ సైతం తెరపైకి వచ్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కాగా, సీఎల్పీ భేటీలో అందరు ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోలేదని.. వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి మద్దతు అడిగారని ప్రత్యర్థి వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇదిలా ఉండగా, తిరువనంతపురంలోని కేరళ పీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలి్‌ప ఎమ్మెల్యే బిందు కృష్ణను కౌగిలించుకునే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం