తిరుప్పరంకుండ్రం ఏకశిలా స్తంభంపై ఎట్టకేలకు వెలిగిన కార్తీకదీపం
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:10 AM
తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండమీద వివాదాస్పద ఏకశిలా స్తంభంపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది.
చెన్నై, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండమీద వివాదాస్పద ఏకశిలా స్తంభంపై ఎట్టకేలకు కార్తీక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భక్తుల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేరింది. 700 మంది సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపు, ఇద్దరు మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణ, అధికార యంత్రాంగం ఏర్పాట్ల నడుమ శనివారం సాయంత్రం కార్తీక దీపోత్సవం ప్రశాంతంగా ముగిసింది. తమ ఆదేశాలను ధిక్కరించిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సుప్రీంకోర్టు శుక్రవారం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఏకశిలా స్తంభంపై శనివారం కార్తీక దీపం వెలిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇద్దరు మాజీ న్యాయమూర్తులను నియమించింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాధన్, జస్టిస్ పార్తీబన్, ముగ్గురు ఆలయ భట్టర్లు ఏకశిలా స్తంభంపై కార్తీక దీపం వెలిగించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ స్తంభం పరిసరాల్లోకి 50 మందిని మాత్రమే అనుమతించారు. తమను కూడా కొండపైకి అనుమతించాలంటూ బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్, హిందూ మున్నని కార్యకర్తలు సీఆర్పీఎఫ్ బలగాలతో వాగ్వాదానికి దిగడంతో ఉన్నతాధికారులు వారితో చర్చించి, శాంతింపజేశారు. ఏకశిలా స్తంభంపై దీపం వెలిగించగానే కొండ కింద ఉన్న వందలాదిమంది భక్తులు ‘హరోం హరా మురుగయ్యా.. వేల్ వేల్ వెట్రివేల్.. వేల్ వేల్ వీర వేల్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మిఠాయిలు పంచి, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీపోత్సవం ముగిశాక మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాధన్, జస్టిస్ పార్తీబన్ మీడియాతో మాట్లాడుతూ కార్తీక దీపం వెలిగించే అవకాశం తమకు దక్కడం ఆనందంగా ఉందన్నారు.