Share News

భర్తను చంపేసి.. కుమారుడిని పొడిచి!

ABN , Publish Date - Jul 17 , 2026 | 06:18 AM

భర్తను కత్తితో పొడిచి చంపేసి.. అదే కత్తితో కొడుకునూ పొడిచేసి.. ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండగా.. అక్కడే మంచంపై పడుకుని ఫోన్‌ చూసుకుంటున్న...

భర్తను చంపేసి.. కుమారుడిని పొడిచి!

  • ఫోన్‌ చూస్తూ కూర్చున్న మహిళ

  • ధారవాడ నగరంలో దారుణం

  • వైద్య దంపతుల మధ్య విభేదాలే కారణం

  • ఆస్పత్రిలో కోలుకుంటున్న కుమారుడు

బెంగళూరు, జూలై 16(ఆంధ్రజ్యోతి): భర్తను కత్తితో పొడిచి చంపేసి.. అదే కత్తితో కొడుకునూ పొడిచేసి.. ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉండగా.. అక్కడే మంచంపై పడుకుని ఫోన్‌ చూసుకుంటున్న మహిళా డాక్టర్‌ పైశాచికత్వం.. చూపరులను నివ్వెరపరిచింది. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని అనస్థీషియా వైద్యుడు డాక్టర్‌ కిరణ్‌ హొన్నణ్ణనవర్‌ను ఆయన భార్య, కంటివైద్య నిపుణురాలు డాక్టర్‌ ప్రియాంక కత్తితో పొడిచి హత్య చేశారు. ఎనిమిదేళ్ల కన్న కొడుకును కూడా అదే కత్తితో పొడిచారు. ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకుని ఫోను చూసుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి రాగా, డాక్టర్‌ను హత్య చేసింది ఆయన భార్య ప్రియాంకనే అని పోలీసులు గురువారం నిర్ధారించారు. నేరం చేసినట్లు ఆమె అంగీకరించారని ధారవాడ పోలీసులు తెలిపారు.

ఇద్దరిదీ రెండో పెళ్లి

ప్రియాంక, కిరణ్‌కు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. తమ భాగస్వాములతో విడిపోయాక, మ్యాట్రిమోని సహకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక సంపన్న కుటుంబానికి చెందినవారు కాగా కిరణ్‌ పేద కుటుంబానికి చెందినవారు. ప్రియాంక డాక్టరే అయినా, ప్రాక్టీస్‌ చేయడం లేదు. కిరణ్‌ మాత్రం వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. పేదలపట్ల మానవత్వం చూపుతూ, ధారవాడలో మంచిపేరు సంపాదించారు. వీరిద్దరికీ వివాహమైన కొంతకాలం తర్వాత విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ప్రియాంక తన భర్తను అనుమానిస్తూ, నిత్యం గొడవపడేవారని తెలుస్తోంది. కిరణ్‌ కుటుంబీకులు ఎవరూ ఇంటికి రాకూడదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సమస్యలను కిరణ్‌ ఎవరికీ చెప్పుకునేవారు కాదని, కొంతకాలంగా ఇంట్లోనూ ఆయన మౌనంగా ఉండేవారని సమాచారం. ఈ క్రమంలో బుధవారం తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రియాంక, పదునైన కత్తితో కిరణ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అదే కత్తితో తమ ఎనిమిదేళ్ల కుమారుడిని రెండుమార్లు పొడిచారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, డాక్టర్‌ ఇంటికి చేరుకున్నారు. వారి కుమారుడికి (బాలుడు) శ్వాస ఆడుతుండటంతో ఆసుపత్రికి తరలించి, వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించి, ఆమే హత్య చేసినట్లు తేల్చి, కేసు నమోదు చేశారు. బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 06:18 AM