విస్తరణ మంటలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:51 AM
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ అసంతృప్తి మంటలు రాజేసింది. మంత్రివర్గంలో తమకు చోటు దక్కలేదని కొందరు.. తమ వారికి అవకాశం ఇవ్వలేదని మరికొందరు...
కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణపై
సీనియర్ల తీవ్ర అసంతృప్తి
పార్టీ, సీఎం డీకేపై ఆగ్రహం ఇండి ఎమ్మెల్యే రాజీనామా
మొత్తం 20 మందికి కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్
మహిళా మంత్రి ఎంపికపై మాజీ సీఎం సిద్దు ఫైర్
వెంటనే జాబితా నుంచి తొలగించిన ముఖ్యమంత్రి
19 మందితో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
బెంగళూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి వర్గ విస్తరణ అసంతృప్తి మంటలు రాజేసింది. మంత్రివర్గంలో తమకు చోటు దక్కలేదని కొందరు.. తమ వారికి అవకాశం ఇవ్వలేదని మరికొందరు అటు పార్టీపైనా, ఇటు ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇండి నియోజకవర్గం ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయగా.. శివమొగ్గ జిల్లా సాగర ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ మంగళవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. మరోవైపు.. మాజీ సీఎం సిద్దరామయ్య సైతం మంత్రివర్గ కూర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు మాటమాత్రం చెప్పకుండానే తన సామాజక వర్గానికి(కురుబ) చెందిన మహిళా నేత గాయత్రిని మంత్రివర్గం జాబితాలో చేర్చడంపై ఆయన నిప్పులు చెరిగారు. ఓబీసీ, ప్రత్యేకించి తన సొంత(కురుబ) సామాజికవర్గానికి చెందిన ఆమెను ఎంపిక చేసేప్పుడు కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. దీంతో వెనువెంటనే సీఎం శివకుమార్.. సదరు జాబితా నుంచి మహిళా నేత పేరును తొలగించారు. అలాగే.. అధిష్ఠానం సిఫారసు చేసిన జాబితాలో ఉన్న మంకాళవైద్య తన మిత్రుడు ఎస్‌ఎస్ మల్లికార్జునను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని.. లేకపోతే తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. దీంతో మాంకాళ వైద్య పేరును తప్పించిన డీకే.. ఆ స్థానంలో మల్లికార్జున పేరును చేర్చారు. ఒకవైపు అసంతృప్తుల సెగలు కొనసాగుతుండగానే.. జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన తర్వాత 19 మందితో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు.. పలు జిల్లాల్లో అసంతృప్త ఎమ్మెల్యేలు నిరసనలతో హోరెత్తించారు. బెళగావిలో లక్ష్మీ హెబ్బాళ్కర్ అనుచరులు పుణె-బెంగళూరు జాతీయ రహదారి టోల్ వద్ద రెండు గంటలపాటు ఆందోళన చేశారు. మైసూరులో తన్వీర్‌సేఠ్‌కు అవకాశం దక్కకపోవడంతో బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రె్‌సవేపై ఆందోళన చేశారు. ఇదే సమయంలో తబ్రేజ్ అనే అనుచరుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కేబినెట్‌లో ప్రస్తుతానికి మహిళా మంత్రి లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలో నాయకత్వ మార్పు తర్వాత జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌తో కలిపి 14 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో 34 స్థానాలు ఉండగా.. మిగిలిన 20 పదవులను భర్తీ చేసేందుకు రెండు నెలలుగా ప్రహసనం సాగింది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..