ఘోర రోడ్డు ప్రమాదం.. కాలి బూడిదైన ఆరుగురు..
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:23 PM
టైరు పేలి ఓ కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు కూడా వ్యాపించాయి. మంటల్లో కాలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు, ఏప్రిల్ 17: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైరు పేలి ఓ కారు బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు కూడా వ్యాపించాయి. మంటల్లో కాలి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు కలబురగి నుంచి బెంగళూరు వెళుతోంది. మరో వైపు ఓ కారు యాదగిరి నుంచి రాయచూరు వెళుతోంది. యాదగిరి దగ్గర కారు ప్రమాదానికి గురైంది.
హైవేపై వేగంగా దూసుకు వెళుతున్న కారు టైర్ పేలింది. దీంతో అదుపుతప్పిన కారు.. వేగంగా వెళ్లి బస్సును ఢీకొట్టింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా కారుకు వ్యాపించాయి. కారు, బస్సు మంటల్లో దగ్ధం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరు మంది కాలి బూడిదయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్పగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లా ఎస్పీ ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అధికారులను ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదంలో ఆరు మంది చనిపోయారు. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. టైర్ పేలటం కారణంగానే ప్రమాదం జరిగింది’ అని తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు, బస్సు మంటల్లో కాలుతున్న దృశ్యాల తాలూకా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి
నా భర్త ఆరోగ్యంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. వినోద్ కాంబ్లీ భార్య
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ