Share News

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు రాజ్‌నాథ్ సింగ్ ఘన నివాళి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:22 AM

కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, సీనియర్ సైనిక అధికారులు నివాళులు అర్పించారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ (ఆదివారం) ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకుని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు రాజ్‌నాథ్ సింగ్ ఘన నివాళి..
Kargil Vijay Diwas 2026

లడఖ్: కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, సీనియర్ సైనిక అధికారులు నివాళులు అర్పించారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇవాళ (ఆదివారం) ఉదయం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకుని అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రి కంటే ముందు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మతో పాటు దళంలోని ఇతర సీనియర్ అధికారులు యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు.


ఈ సందర్భంగా సైనిక గౌరవాలతో నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. మూడు అధునాతన హెలికాప్టర్లు బాణం ఆకారంలో ప్రయాణిస్తూ స్మారక చిహ్నంపై పూల వర్షం కురిపించాయి. మరోవైపు, కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి ద్రాస్‌లోని యుద్ధ స్మారక ప్రాంగణంలో భారత సైన్యం ‘శౌర్య సంధ్య’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి పాల్గొని, కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబ సభ్యులకు లాంఛనప్రాయంగా ‘కలశం’ అందజేశారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన జవాన్ల త్యాగాలను భారత్ ఎన్నటికీ మరువదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.


కాగా, 1999లో మంచుతో కప్పబడిన కార్గిల్ పర్వత శిఖరాల్లో పాకిస్థాన్ సైనికుల చొరబాట్లను తిప్పికొట్టేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టింది. ప్రతికూల వాతావరణం, శత్రు కాల్పులను ఎదుర్కొంటూ భారత సైనికులు అసాధారణ ధైర్యంతో పోరాడి వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకుంటారు. దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లకు ఈరోజు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..

జేఎస్జేడీ అధినేత తేజ్ ప్రతాప్ యాదవ్‌ అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు..

Updated Date - Jul 26 , 2026 | 11:35 AM