జస్టిస్ యశ్వంత్‌వర్మ రాజీనామా
ABN , Publish Date - Apr 11 , 2026 | 04:17 AM
తన నివాసంలో భారీ ఎత్తున కాలిపోయిన నోట్లకట్టలు బయటపడిన ఘటనలో అభిశంసనను ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్‌వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు....
రాష్ట్రపతికి రాజీనామా లేఖ.. ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తన నివాసంలో భారీ ఎత్తున కాలిపోయిన నోట్లకట్టలు బయటపడిన ఘటనలో అభిశంసనను ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్‌వర్మ ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న యశ్వంత్‌వర్మ.. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. ఏప్రిల్ 9వ తేదీతో ఉన్న ఈ లేఖలో.. ‘న్యాయమూర్తిగా ఇన్నాళ్లు సేవలందించటం నాకు ఎంతో గౌరవనీయమైన విషయం. ప్రస్తుతం తీవ్రమైన ఆవేదనతో రాజీనామా చేస్తున్నా. ఇందుకు గల కారణాలు చెప్పి మీకు ఇబ్బంది కలిగించదల్చుకోలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ రాజీనామాతో యశ్వంత్‌వర్మ అభిశంసనకు కొనసాగుతున్న ప్రక్రియ వీగిపోనుంది. ప్రస్తుతం ముగ్గురు సభ్యుల కమిటీ.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతోంది. వాదనలు వినిపించటానికి ఈ కమిటీ.. జస్టిస్ వర్మకు శుక్రవారం నుంచి 4రోజుల పాటు సమయం ఇచ్చింది. ఈ వాదనలకు ఒక రోజు ముందే ఆయన రాజీనామా చేయటం గమనార్హం. కాగా, న్యాయమూర్తుల రాజీనామాకు ఆమోదం అవసరం లేదు. రాజీనామా చేస్తూ లేఖ రాస్తే సరిపోతుంది.
ఇదీ నేపథ్యం..
గత ఏడాది మార్చి 14వ తేదీన.. అప్పట్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూంలో రాత్రి 11.35 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి మంటల్లో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించాయి. ఈ విషయం మీడియా ద్వారా బయటకు వచ్చి తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి లేఖ రాశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని జస్టిస్ యశ్వంత్‌వర్మ ఖండించారు. తమ ఇంటి స్టోర్‌రూంలో కాలిపోయిన నోట్లకట్టలను తానుగానీ, తన కుటుంబసభ్యులుగానీ పెట్టలేదని, వాటితో తమకు సంబంధం లేదన్నారు. దీంతో సీజేఐ అంతర్గత విచారణకు ఆదేశించారు. తర్వాత ముగ్గురు సభ్యులతో ఒక విచారణ కమిటీని నియమించారు. గతంలో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్‌వర్మను మార్చి 28వ తేదీన తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపించారు. దీనిపై అక్కడి న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. యశ్వంత్‌వర్మకు న్యాయపరమైన విధులు ఏవీ అప్పగించవద్దంటూ.. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు సూచించింది.
మే 3వ తేదీన యశ్వంత్‌వర్మపై ఉన్న అవినీతి ఆరోపణలు వాస్తవమేనని విచారణ కమిటీ తేల్చింది. రాజీనామా చేయాలని సీజేఐ ఆదేశించినా యశ్వంత్‌వర్మ అందుకు సిద్ధపడలేదు. దీంతో ఆయనను అభిశంసన ద్వారా తొలగించాలని రాష్ట్రపతికి, ప్రధానికి సీజేఐ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, విచారణ కమిటీ నివేదికలో వాస్తవాలు లేవని, ఆ నివేదికను రద్దు చేయాలని కోరుతూ యశ్వంత్‌వర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని కోరుతూ పలు పార్టీలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ గతేడాది ఆగస్టు 12న ఆమోదించారు. ఈ మేరకు, ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ నియామకాన్ని సవాల్ చేస్తూ వర్మ తిరిగి సుప్రీంకోర్టులో కేసు వేశారు. కోర్టు ఈసారి కూడా ఆయన అభ్యర్థనను అంగీకరించలేదు. కమిటీ వాదనలు వినే ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే యశ్వంత్‌వర్మ.. అభిశంసనకు గురై పదవిని వీడాల్సి వచ్చేది. ఈలోపే ఆయన రాజీనామా చేశారు. గతంలో సుప్రీంకోర్టు జడ్జి వి రామస్వామి, కోల్‌కతా హైకోర్టు జడ్జి సౌమిత్రసేన్ కూడా అభిశంసన తీర్మానం ఎదుర్కొంటున్న తరుణంలో పదవికి రాజీనామా చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లు కాగా యశ్వంత్‌వర్మ వయస్సు 57 ఏళ్లు. యశ్వంత్‌వర్మ 1992లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 2014లో అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2016లో శాశ్వత జడ్జిగా ప్రమాణం చేశారు. 2021లో ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
నాకు అన్యాయం: జస్టిస్ వర్మ
ఒక సిట్టింగ్ జడ్జి పట్ల జరిగిన అనుచిత వ్యవహారాన్ని చరిత్ర కచ్చితంగా రికార్డు చేస్తుందన్న ఆశాభావంతో రాజీనామా చేస్తున్నానని జస్టిస్ యశ్వంత్‌వర్మ పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ నియమించిన విచారణ కమిటీకి ఈ మేరకు 13 పేజీల లేఖను శుక్రవారం పంపించారు. తన అధికారిక నివాసంలోని స్టోర్‌రూంలో కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడిన సమయంలో తాను కుటుంబంతోపాటు విహారయాత్రలో భాగంగా ఓ అటవీప్రాంతంలో ఉన్నానని, జరిగిన ఘటన గురించి తనకు కొన్ని గంటల తర్వాత తెలిసిందని ఆయన పేర్కొన్నారు. నివాసానికి బయట స్టోర్‌రూం విడిగా ఉంటుందని, దానిని తన సహాయకసిబ్బంది వినియోగించుకునేవారని, దాని తాళం చెవి కూడా తన వద్ద ఉండేది కాదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..
బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్