Share News

కేంద్ర ప్రభుత్వానికి మాజీ సీజేఐ చంద్రచూడ్‌ తలొగ్గారు

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:26 AM

సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ జోక్యం, మాజీ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి మాజీ సీజేఐ చంద్రచూడ్‌ తలొగ్గారు
court order

kaul.jpg

  • కొలీజియం భేటీకి ముందే జడ్జిల పేర్లపై ముందస్తు ఆమోదం కోరారు

  • ప్రభుత్వంతో సంప్రదింపులకు, ముందస్తుఆమోదానికి మధ్య తేడాను గుర్తించాలి

  • న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించాలంటే..

  • ప్రభుత్వ ఒత్తిడిని కొలీజియం ప్రతిఘటించాలి

  • ‘వితౌట్‌ ఫియర్‌ ఆర్‌ ఫేవర్‌’ పుస్తకంలో సుప్రీంకోర్టు

  • మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ వ్యాఖ్యలు

  • ప్రశ్నార్థకంగా న్యాయవ్యవస్థ స్వతంత్రత!: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 25: సుప్రీంకోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ జోక్యం, మాజీ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ సంచలన ఆరోపణలు చేశారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ అతిగా ప్రభుత్వానికి తలొగ్గారని, అవసరానికి మించి సానుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన పేర్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు ఆమోదం కోరారని ఆరోపించారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించాలంటే.. ప్రభుత్వ ఒత్తిడిని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిఘటించాలని స్పష్టం చేశారు. త్వరలో విడుదల చేయనున్న తన ఆత్మకథ ‘వితౌట్‌ ఫియర్‌ అర్‌ ఫేవర్‌’ పుస్తకంలో, ఒక ఆంగ్ల వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ ఈ వివరాలను వెల్లడించారు. సుప్రీంకోర్టులో ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సమావేశం అంశాన్ని ప్రస్తావిస్తూ జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ పలు వివరాలు వెల్లడించారు. ‘‘ఆరుగురు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సమావేశమైంది. ఐదుగురి పేర్లపై ముందస్తుగానే అంగీకారం కుదిరింది. ఆరో అభ్యర్థి పేరును జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రతిపాదించారు. ఆ వ్యక్తి నియామకానికి సంబంధించి ముందస్తుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని భావించారు.

నన్ను పక్కనే ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లి.. ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఫోన్‌ చేయాలా? అని అడిగారు. ప్రభుత్వంతో సంప్రదింపులకు, ముందస్తు ఆమోదం కోరడానికి తేడా ఉంది.


chandrachud copy.jpgకొలీజియం అధికారికంగా చర్చించడానికి ముందే ప్రభుత్వ అనుమతి కోరడమంటే.. దాన్ని ముందస్తు ఆమోదం తీసుకోవడంగానే నేను భావించాను. దానికి నేను సానుకూలత వ్యక్తం చేయలేదు. దురదృష్టకరం ఏమిటంటే ఇలాంటివి చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌కు ముందు, ఆ తర్వాత కూడా జరిగాయి, జరుగుతున్నాయి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించుకోవాలంటే.. ప్రభుత్వ ఒత్తిడిని కొలీజియం ప్రతిఘటించాలి. న్యాయమూర్తుల నియామకంపై కొలీజియం నిర్ణయం తర్వాతే, అవసరమైతేనే ప్రభుత్వంతో సంప్రదింపులు జరగాలి’’ అని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ స్పష్టం చేశారు. న్యాయపరమైన అంశాల్లో జస్టిస్‌ చంద్రచూడ్‌కు లోతైన పరిజ్ఞానం ఉందని, కానీ ప్రభుత్వంతో సంప్రదింపులు, సహకారం విషయంలో ఆయన అవసరానికి మించి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ సీజేఐగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయనకు సహకరిస్తానని చెప్పానని వివరించారు. అయితే ప్రభుత్వంతో వ్యవహరించే అంశంలో అభిప్రాయ భేదాలతోనే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. ఇక మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని అంశాలపై విచారణను తన ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి మార్చినప్పుడు తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశానని జస్టిస్‌ కౌల్‌ వివరించారు. కేసులో ఎలా తీర్పు రావొచ్చన్న అంచనాలు, సందేహాల ఆధారంగా ఒక ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి విచారణను మార్చడం సరికాదన్నారు. జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌.. 2022 జూన్‌ నుంచి 2023 డిసెంబరులో రిటైర్‌ అయ్యే వరకు సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులుగా ఉన్నారు.

న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రశ్నార్థకం: కాంగ్రెస్‌

జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు, వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని కాంగ్రెస్‌ విమర్శించింది. మోదీ ప్రభుత్వ హయాంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ‘‘జస్టిస్‌ కౌల్‌ చెప్పిన విషయాలను జస్టిస్‌ చంద్రచూడ్‌ ఖండించలేదు. సున్నితమైన కేసుల్లో ధర్మాసనాల మార్పులు, నియామకాల్లో ప్రభుత్వ ఒత్తిళ్లు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఆందోళనను మరింత పెంచుతున్నాయి’’ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం

యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన

Updated Date - Oct 26 , 2026 | 04:41 AM