Share News

మరో పేపర్‌ లీక్‌ రచ్చ!

ABN , Publish Date - Aug 04 , 2026 | 05:58 AM

పలు నియాకమ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఏప్రిల్‌ 19న నిర్వహించిన 14వ జేపీఎస్సీ కంబైన్డ్‌ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షను..

మరో పేపర్‌ లీక్‌ రచ్చ!

జార్ఖండ్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతం

  • జేపీఎస్సీ ప్రిలిమ్స్‌ రద్దుకు డిమాండ్‌

  • ఆందోళనలకు సీజేపీ మద్దతు

రాంచీ, ఆగస్టు 3: పలు నియాకమ పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఏప్రిల్‌ 19న నిర్వహించిన 14వ జేపీఎస్సీ కంబైన్డ్‌ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని, జేపీఎస్సీ, జేఎ్‌సఎ్‌ససీ నిర్వహించిన పలు పరీక్షల పేపర్‌ లీకేజీ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని, నియామక వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యార్థి నేత దేవేంద్రనాథ్‌ మహతో ఆదివారం రాంచీలోని జైపాల్‌ సింగ్‌ ముండా స్టేడియంలో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. జార్ఖండ్‌లో ఆందోళనలకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) మద్దతు పలికింది. ‘జార్ఖండ్‌ విద్యార్థులకు సీజేపీ అండగా ఉంటుంది. వారి డిమాండ్లకు మద్దతుగా నిలబడతాం’ అని సీజేపీ నేత అభిజీత్‌ దీప్కే ‘ఎక్స్‌’ పోస్టులో పేర్కొన్నారు. నిరాహార దీక్ష సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి మహతో మాట్లాడుతూ.. జూలై 2న జేపీఎస్సీ ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఆ తర్వాత గవర్నర్‌, సీఎంను కలిసి పేపర్‌ లీకేజీపై ఆధారాలు సమర్పించామని తెలిపారు. కొద్ది వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నా విద్యార్థుల ఆందోళనలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, జేపీఎస్సీలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు, తమ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 14వ పీటీ పరీక్షను రద్దు చేయడం, టీడీపీఎల్‌ ఏజెన్సీ ద్వారా నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సీఎం హేమంత్‌ సొరేన్‌కు సమర్పించిన తమ డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించే వరకు తాను దీక్షను కొనసాగిస్తానని మహతో తెలిపారు.


విద్యార్థుల ఆందోళనలు ఎందుకు?

వరుస పేపర్‌ లీక్‌ ఆరోపణలు, నియామక ప్రక్రియలో అవకతవకలు, పాలనాపరమైన లోపాలతో తమ కెరీర్‌కు నష్టం జరుగుతోందంటూ విద్యార్థులు కొద్ది వారాల క్రితం రాష్ట్రంలో ఆందోళనలు ప్రారంభించారు. నియామక పరీక్షల వ్యవస్థల్లో సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని, పారదర్శకత తీసుకురావాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం సొరేన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో అసెంబ్లీకి ర్యాలీ చేపడుతామని హెచ్చరించారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ ఆందోళనల సమయంలో నిరసనకారుల కోసం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి కొంత మంది స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం ఆర్డర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే నమూనా రాంచీలో కూడా కనిపిస్తోంది. ఆందోళనకారులకు పలుప్రాంతాల నుంచి ఆహారాన్ని పంపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 05:58 AM