రాజ్యసభకు మరోసారి ఎన్నికైన పరిమళ్ నత్వానీ
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:44 PM
జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు నేడు (గురువారం) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎన్డీయే (NDA) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ కైవసం చేసుకోగా.. మరో స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ దక్కించుకున్నారు.
రాంచీ: జార్ఖండ్‌లోని రెండు రాజ్యసభ స్థానాలకు నేడు (గురువారం) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని ఎన్డీయే (NDA) మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ కైవసం చేసుకోగా.. మరో స్థానాన్ని జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ దక్కించుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో నత్వానీ 28 ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే లభించాయి. మరోవైపు జేఎంఎం అభ్యర్థి రామ్ 30 ఓట్లు కైవసం చేసుకున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
జార్ఖండ్‌లో ఎన్డీయేకు కేవలం 24 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే, నత్వానీ 28 ఓట్లు సాధించడంతో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలగా, ఎన్డీయేకు మాత్రం అదృష్టం కలిసొచ్చింది. కాగా, జార్ఖండ్ అసెంబ్లీలో ఎన్డీయేకు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో బీజేపీకి 21 మంది, ఎల్‌జేపీ (రామ్ విలాస్), ఏజేఎస్‌యూ, జేడీ(యూ) పార్టీలకు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. ఇండియా కూటమికి 56 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో జేఎంఎం నుంచి 34 మంది, కాంగ్రెస్ నుంచి 16 మంది, ఆర్జేడీ నుంచి నలుగురు, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నుంచి ఇద్దరు ఉన్నారు.
ఈ విజయంతో పరిమళ్ నత్వానీ చరిత్రాత్మకంగా నాలుగోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2008 నుంచి 2020 మధ్యకాలంలో ఈ రాష్ట్రం నుంచి స్వతంత్ర ఎంపీగా వరుసగా రెండు పర్యాయాలు ఎన్నికైన నత్వానీ.. మరోసారి జార్ఖండ్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన స్వతంత్ర సభ్యుల్లో ఒకరిగా ఆయనకు ఘనత దక్కింది. 2020 నుంచి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీ, ఇప్పుడు మళ్లీ జార్ఖండ్ నుంచి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాజ్యసభకు నాలుగోసారి ఎన్నికైనందుకు కృతజ్ఞతలు తెలిపారు.
2008లో తన పార్లమెంటరీ ప్రస్థానం జార్ఖండ్ నుంచి ప్రారంభమైందని, ఈ రాష్ట్రం నుంచే ఇప్పుడు మూడోసారి అవకాశం లభించడం తనకు భావోద్వేగ క్షణమని పరిమళ్ నత్వానీ పేర్కొన్నారు. కాగా, జార్ఖండ్ ముక్తి మోర్చా సహ వ్యవస్థాపకుడు శిబు సోరెన్ మరణంతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. మరో స్థానం బీజేపీ సభ్యుడు దీపక్ ప్రకాశ్ పదవీకాలం జూన్ 21తో ముగియనుండటంతో ఎన్నికలను నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.. కేంద్రం స్పందన ఏంటంటే..
అజిత్ దోవల్ ఆహ్వానం.. భారత్‌లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి