2024లోనే పేపర్ లీక్.. ఝార్ఖండ్‌లో తెరపైకి సీఐడీ రిపోర్టు
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:37 PM
ఝార్ఖండ్‌లో పేపర్ లీక్ ఉదంతంపై ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితమే అక్కడ వెలుగు చూసిన పేపర్ లీక్ ఉదంతం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌లో పేపర్ లీక్ ఉదంతంపై ప్రస్తుతం విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితమే అక్కడ వెలుగు చూసిన పేపర్ లీక్ (జేఎస్ఎస్‌సీ-సీజీఎల్ పరీక్ష) ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. నాటి పేపర్ లీక్‌పై సీఐడీ నివేదికలో పలు కీలక వివరాలు ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
నాడు మొదటిసారి నిర్వహించిన జేఎస్ఎస్‌సీ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహించింది. రీటెస్టులో పేపర్ లీక్‌కు అవకాశమే లేకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయినప్పటికీ మరోసారి పేపర్ లీక్ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ లేకపోయినా పేపర్ లీక్ ముఠాలు ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా సమాధానాలను బయటకు బట్వాడా చేశాయని తెలిసింది.
ఉదంతంపై కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ‘మాకు సమాధానాలే వచ్చాయి. ప్రశ్నలు కాదు. పరీక్ష తరువాత ఆ సమాధానాలు సరైనవేనని తేలింది. ఈ రిపోర్టును కూడా కోర్టులో సమర్పించాము’ అని పిటిషనర్ ఒకరు తెలిపారు. ఈ ఉదంతంలో 150 ప్రశ్నలకు గాను 120 ప్రశ్నలు లీకైనట్టు సీఐడీ తేల్చిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, రిపోర్టును 2025లో పక్కనపెట్టిన ప్రభుత్వం మరో దర్యాప్తునకు ఆదేశించింది. పేపర్ లీకులు జరగలేదని రెండో దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. దీంతో, విషయం కొంతకాలం పాటు సద్దుమణిగినట్టు అనిపించినా విద్యార్థుల్లో మాత్రం ఆగ్రహం కొనసాగింది.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పరీక్షల్లో కూడా పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన చేపడుతున్నారు. రాంచీలోని జైపాల్ సింగ్ స్టేడియంలో విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మహాతో ప్రారంభించిన ఆమరణ దీక్ష ప్రస్తుతం 16వ రోజుకు చేరుకుంది. పరీక్ష రద్దు చేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి దీపికా సింగ్ ఇప్పటికే వారితో చర్చించారు. విద్యార్థుల ఆందోళన సమంజసమైనదేనని అన్నారు. సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని కూడా చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా దళాలు ఆకస్మిక తనిఖీలు
తరగతి గదిలో హెడ్‌మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసి..