కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతం.. తుపాకీ లాక్కుని పారిపోతుండగా
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:08 PM
ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోతుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా మరణించాడని పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. పోలీసుల తుపాకీ లాక్కుని పారిపోతుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా మరణించాడని పోలీసులు తెలిపారు. సాహిబ్‌గంజ్ డివిజనల్ జైలుకు అతడిని తరలిస్తుండగా శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని చెప్పారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ధన్‌బాద్ జైలు నుంచి సాహిబ్‌గంజ్ మండల్ జైలుకు తరలిస్తుండగా సాహిబ్‌గంజ్ హైవేపై ఈ ఘటన జరిగింది. నాలుగు పోలీసు వాహనాల ఎస్కార్ట్‌తో అతడిని పోలీసులు తరలించారు. అయితే, జమ్‌తారా పోలీస్ స్టేషన్ పరిధిలోకి కాన్వాయ్ వచ్చేసరికి తాను మరుగుదొడ్డికి వెళ్లాలని అతడు కోరాడు. వాహనాలు ఆపిన సమయంలో అతడు తుపాకీ లాక్కుని చీకట్లోకి పారిపోయేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. తమపై కాల్పులు కూడా జరిపాడని అన్నారు. స్వీయరక్షణ కోసం తామూ కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. అతడు ఘటనా స్థలంలోనే మరణించినట్టు అక్కడికి వచ్చిన మెడికల్ టీమ్ ప్రకటించింది. జమ్‌తారా ఎస్పీ శంభు కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఝార్ఖండ్‌లో సిన్హాపై అనేక కేసులు ఉన్నాయి. బలవంతపు వసూళ్లు, హత్య, హత్యాయత్నం తదితర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రాష్ట్రంలో తన ఇన్‌ఫ్లుయెన్స్‌ను కొనసాగించేందుకు పలు గ్యాంగులతో జట్లు కట్టి నెట్‌వర్క్‌ను నిర్మించుకున్నాడని పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
జంతర్‌మంతర్ నిరసన.. ఆ బాలికపై కేసు ఉండదన్న పోలీసు వర్గాలు
ఎఫ్‌ఐఆర్ ఇంకా వెనక్కు తీసుకోలేదు.. ప్రధాని క్షమించినా.. బాలిక తల్లి ఆవేదన