Share News

సీజేపీ ఆందోళన.. కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్..

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:38 PM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు బలప్రయోగంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూర్పుపై వివాదం నెలకొంది. జస్టిస్ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

సీజేపీ ఆందోళన.. కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్..
Supreme Court

ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనల్లో పోలీసులు బలప్రయోగంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ కూర్పుపై వివాదం నెలకొంది. జస్టిస్ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీని పునర్వ్యవస్థీకరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కమిటీ సభ్యుల ఎంపికపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గోపాల్‌ శంకరనారాయణన్‌, ప్రశాంత్‌ భూషణ్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల ఆందోళనల సమయంలో పోలీసుల బలప్రయోగం, దాడులపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.


అయితే కమిటీ కూర్పు నిష్పాక్షికంగా లేదన్న అనుమానాలు తమకు ఉన్నాయని, ప్రస్తుత కమిటీ స్థానంలో కొత్త కమిటీని నియమించాలని పిటిషనర్ల న్యాయవాదులు సీజేఐ ధర్మాసనాన్ని కోరారు. పిటిషనర్ల వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు. కమిటీ ఏర్పాటు విషయంలో ప్రతి అంశాన్నీ సందేహించడం తగదని, అందుబాటులో ఉన్న అత్యుత్తమ నిపుణులతోనే కమిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పిటిషనర్ల తీరుపై సొలిసిటర్ జనరల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన కమిటీపైనే అనుమానాలు వ్యక్తం చేయడం దర్యాప్తు ప్రక్రియపై అనవసరమైన సందేహాలు రేకెత్తిస్తున్నాయని అభ్యంతరం తెలిపారు.


కాగా, కమిటీపై పిటిషనర్లకు ఉన్న అనుమానాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు. సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలోనే అది దర్యాప్తు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కమిటీ సభ్యులను అందుబాటులో ఉన్న అత్యుత్తమ నిపుణుల నుంచే ఎంపిక చేశామని తెలిపారు. దాని పనితీరుపై సుప్రీంకోర్టుకు పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, కమిటీ కూర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ అంశంపై త్వరలోనే విచారణ చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో జస్టిస్ ఆర్‌. సుభాష్‌ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి]

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్‌ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..

డ్రగ్స్‌ రవాణా కేసులో మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ అరెస్ట్..

Updated Date - Aug 25 , 2026 | 12:38 PM