Share News

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:28 AM

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేటు బస్సు కొండ పైనుంచి కిందకు పడిపోవడంతో...

జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం 21 మంది మృతి

  • మరో 51 మందికి గాయాలు

  • కొండ పైనుంచి బస్సు బోల్తా..

  • 100 మీటర్ల ఎత్తు నుంచి పడిపోవడంతో నుజ్జునుజ్జు

  • ఉధంపూర్‌ జిల్లాలో ఘటన

జమ్మూ, ఏప్రిల్‌ 20: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌ జిల్లాలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసిన ఓ ప్రైవేటు బస్సు కొండ పైనుంచి కిందకు పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 51 మంది గాయాలపాలయ్యారు. బస్సు వచ్చి ఒక ఆటో రిక్షాపై పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు గాయాలపాలైనట్టు అధికారులు తెలిపారు. రామ్‌నగర్‌ ప్రాంతంలో కొండపై ఉన్న కగోర్ట్‌ గ్రామానికి సమీపంలో ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మలుపు వద్ద బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కొండ మార్గం గుండా వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌ సహాయక చర్యలకు ఉపక్రమించింది. బస్సు దాదాపు 100 మీటర్ల పైనుంచి పడిపోవడం వల్ల నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రమాదం హృదయ విదారకమని, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయాన్ని అందిస్తామని జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున, స్పల్పంగా గాయాలైన వారికి రూ.50 వేల చొప్పున పరిహారాన్ని సీఎం ప్రకటించారు.

Updated Date - Apr 21 , 2026 | 03:28 AM