Share News

ఐసిస్‌ ఆదేశాలతోనే ‘రైసిన్‌’ కుట్ర

ABN , Publish Date - May 07 , 2026 | 07:27 AM

దేశంలో భారీ స్థాయిలో జీవ, రసాయన ఆయుధాలతో దాడులకు పాల్పడేందుకు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన..

ఐసిస్‌ ఆదేశాలతోనే ‘రైసిన్‌’ కుట్ర

  • హైదరాబాదీ డాక్టర్‌ మొహియుద్దీన్‌కు ‘ఆమిర్‌’ పదవి ఇస్తామని ఆఫర్‌

  • సామూహిక విషప్రయోగం కుట్ర కేసులో ఎన్‌ఐఏ అభియోగాలు

  • అహ్మదాబాద్‌ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌

న్యూఢిల్లీ, మే 6: దేశంలో భారీ స్థాయిలో జీవ, రసాయన ఆయుధాలతో దాడులకు పాల్పడేందుకు హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దీన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆజాద్‌, మొహమ్మద్‌ సుహెల్‌లు కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ ఆదేశాల మేరకే వీరు బహిరంగ ప్రదేశాల్లో రైసిస్‌ విషప్రయోగానికి కుట్ర చేసినట్లు పేర్కొంది. గతేడాది నవంబర్‌లో బట్టబయలైన ‘రైసిన్‌’ కుట్ర కేసులో అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు బుధవారం ప్రకటించింది. ఐసి్‌సకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ ముగ్గురు తరచూ ఆదేశాలు స్వీకరిస్తూ దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు ప్రయత్నించారని తెలిపింది. దేశంలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించి, సామూహిక విష ప్రయోగం చేస్తే డాక్టర్‌ మొహియుద్దీన్‌ను ఐసిస్‌ దక్షిణాసియావిభాగానికి ఆమిర్‌ (అధిపతి)ను చేస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. గత ఏడాది నవంబర్‌లో గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక పోలీస్‌ విభాగం (ఏటీఎస్‌) ఆ రాష్ట్రంలోని ఓ చెక్‌పోస్టు వద్ద డాక్టర్‌ మొహియుద్దీన్‌ను అరెస్టు చేయటంతో ఈ కుట్ర బయటపడింది. అరెస్టు చేసిన సమయంలో అతడి నుంచి నాలుగు లీటర్ల ఆముదం నూనెను, ఆయుధాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు యూపీకి చెందిన ఆజాద్‌, సుహెల్‌లను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ఎన్‌ఐఏ ఈ ఏడాది జనవరిలో చేపట్టింది. హైదరాబాద్‌లోని మొహియుద్దీన్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా, రైసిన్‌ను తయారు చేసేందుకు అతడు తన ఇల్లునే ప్రయోగశాలగా మార్చుకున్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 07:27 AM