Share News

ఉత్పత్తి ఆపలేరు.. ఎగుమతులు చేయలేరు

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:57 AM

ఇరాన్‌ చమురు పరిశ్రమ సంకటంలో పడింది. ఓ పక్క ఆంక్షలు, హోర్ముజ్‌ను అమెరికా దిగ్బంధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. మరోపక్క బావులకు...

ఉత్పత్తి ఆపలేరు.. ఎగుమతులు చేయలేరు

  • సంకటంలో ఇరాన్‌ చమురు పరిశ్రమ

  • హోర్ముజ్‌లో అమెరికా దిగ్బంధనం ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: ఇరాన్‌ చమురు పరిశ్రమ సంకటంలో పడింది. ఓ పక్క ఆంక్షలు, హోర్ముజ్‌ను అమెరికా దిగ్బంధించడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. మరోపక్క బావులకు నష్టం వాటిల్లకుండా ఉత్పత్తిని నిలిపివేసే పరిస్థితి లేదు. దీంతో ఇరాన్‌లో ఉత్పత్తి అయిన ఆయిల్‌ నిల్వలు రోజురోజుకు పేరుకుపోతున్నాయి. చమురును ఎలా స్టోరేజీ చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఖర్గ్‌ ద్వీపంలోని నిల్వ స్థావరాలు దాదాపు నిండిపోయాయి. మరో 12-13 రోజుల్లో దేశంలో ఉన్న నిల్వ చేసే ప్రదేశాలు పూర్తిగా నిండిపోతాయి. దీంతో పాతబడి పక్కన బెట్టిన చమురు నౌక ‘నాషా’ను కూడా ఇరాన్‌ ప్రభుత్వం రంగంలోకి దించింది. దానిలో ఇంధనం నింపి ఓ ఫ్లోటింగ్‌ స్టోరేజీగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. దీనిని బట్టి చూస్తే ఇరాన్‌ చమురు మౌలిక సదుపాయాలను అమెరికా ఎంత గట్టిగా అడ్డుకొంటోందో అర్థమవుతుంది. గల్ఫ్‌ న్యూస్‌కు మారిటైమ్‌ నిపుణులు చెప్పిన మేరకు ఇరాన్‌లో మరో కోటి 30 లక్షల బ్యారెళ్ల చమురు నిల్వకే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న చమురు రోజుకు 10 లక్షల నుంచి 11 లక్షల బ్యారెళ్ల వరకూ ఉంటోంది. అంటే మరో 12-13 రోజుల్లోనే స్టోరేజీ అంతా నిండిపోతుంది. అమెరికా దిగ్బంధనం వల్ల ఇప్పటికే హోర్ముజ్‌ జలసంధి మీదుగా ఇరాన్‌ చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 15 కోట్ల బ్యారెళ్ల ఇరాన్‌ చమురు రవాణాలో లేదా నౌకల్లో నిల్వ ఉందని అంచనా.

వెలికితీత ఆపితే.. చమురు నష్టపోయినట్టే!

చమురు ఉత్పత్తి చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఏదో మనం ఇంట్లో కుళాయి కట్టేసినట్టుగా.. చమురు బావులను మూసేసి ఆపేయడం కుదిరేపనికాదు. పైగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది కూడా. దీనంతటికీ భూగర్భంలో చమురు నిల్వలు ఉండే తీరు, పీడనం, వెలికితీతకు అవసరమైన ప్రక్రియే కారణం. భూమిపై చెరువులు, సరస్సుల్లా భూగర్భంలో చమురు నిల్వలు ఉండవు. రాతి పొరల్లో శిలాజాలతో కూడిన రంధ్రాల మధ్య చమురు ఉంటుంది. చమురు కోసం తవ్వే బోర్ల ద్వారా ఒకవైపు నుంచి తీవ్రమైన ఒత్తిడితో గాలిని పంప్‌ చేస్తూ ఉంటే.. మరోవైపు చమురు పైకి వస్తూ ఉంటుంది. ఒకవేళ గాలిని పంప్‌ చేయడం ఆపేస్తే.. లోపల ఒత్తిడి తగ్గిపోయి, భూగర్భంలోని చుట్టుపక్కల ప్రదేశాల నుంచి నీరు వచ్చి చమురు నిల్వలున్న ప్రదేశాల్లో నిండిపోతుంది. దానివల్ల చమురు ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకే ఉత్పత్తి నిలిపివేసే పరిస్థితి లేక.. ఇరాన్‌ తమ డిమాండ్లకు తలొగ్గుతుందని అమెరికా భావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 05:57 AM