గెలిచిందెవరు? ఓడిందెవరు?
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:49 AM
ఇరాన్ వద్ద ఉన్న యురేనియం స్వాధీనం చేసుకోవడం.. ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న పాలకులను మార్చి తమకు అనుకూలంగా ఉండేవారిని పాలకులుగా నియమించడం.. అనే రెండు...
యుద్ధంతో ఇరాన్‌లో పాలనను మార్చలేకపోయిన అమెరికా, ఇజ్రాయెల్
ఆ దేశ యురేనియంను స్వాధీనం చేసుకోవడంలోనూ విఫలం
హోర్ముజ్‌ను తెరవలేకపోయిన ట్రంప్
ఒక్క లక్ష్యమూ నెరవేరకుండానే కాల్పుల విరమణకు సిద్ధం
అమెరికా, ఇజ్రాయెల్‌ను నిలువరించి సత్తా చాటిన ఇరాన్
టోల్ వసూలు ద్వారా హోర్ముజ్‌పై శాశ్వత పట్టుకూ యత్నాలు
అమెరికాను నమ్ముకుని మునిగిన యూఏఈ, సౌదీ అరేబియా
ఇజ్రాయెల్‌లో నెతన్యాహుకు సొంత ప్రజల నుంచే నిరసన
సుప్రీం లీడర్ ఖమేనీ సహా ఎంతో మంది కీలక నాయకులను కోల్పోయిన ఇరాన్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఇరాన్ వద్ద ఉన్న యురేనియం స్వాధీనం చేసుకోవడం.. ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న పాలకులను మార్చి తమకు అనుకూలంగా ఉండేవారిని పాలకులుగా నియమించడం.. అనే రెండు లక్ష్యాలతో అమెరికా, ఇజ్రాయెల్ ఆ దేశంపై యుద్ధాన్ని మొదలుపెట్టాయి! నలభై రోజులు గడిచాక పరిస్థితి చూస్తే.. ఆ రెండు లక్ష్యాలనూ సాధించడంలో ట్రంప్, నెతన్యాహు విఫలమయ్యారు! యుద్ధం జరుగుతుండగా.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ బిగపట్టడంతో ఒత్తిడి పెరిగి నోటికొచ్చినట్టు మాట్లాడిన ట్రంప్.. ఆ జలసంధిని తెరవాలంటూ పదేపదే హుకుం జారీ చేశారు. అదీ జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రూ.లక్షల కోట్లు ఖర్చు చేసి, వందలాది మంది ప్రాణాలను బలిగొని, ప్రత్యక్షంగా గల్ఫ్ ప్రాంతాన్ని, ఇంధన కొరతకు కారణమై పరోక్షంగా ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన అమెరికా, ఇజ్రాయెల్.. ఈ యుద్ధం ద్వారా తాము అనుకున్న లక్ష్యాల్లో ఒక్కదాన్నీ సాధించలేకపోయాయన్నది కఠిన వాస్తవం. యుద్ధం మొదలైనరోజే సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖమేనీ చనిపోయినా.. ఆయన కుమారుడు మొజ్తబాకు పట్టంగట్టి ఇరాన్ ఈ యుద్ధాన్ని కొనసాగించింది. కాలక్రమంలో అగ్రనాయకులు ఎందరు మరణించినా.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు! ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరిస్తూ వచ్చింది. ఒక దశలో తన దూకుడుతో అమెరికావిమానవాహక యుద్ధనౌకను సైతం వెనక్కి తగ్గేలా చేసింది. ‘నువ్వు నా మీదకి దాడికి వస్తే.. ఈ ప్రాంతంలో నీ మిత్రదేశాలను నేను దెబ్బతీస్తా’ అని స్పష్టంగా బెదిరించి, దాడులు చేసి అమెరికాను అక్షరాలా నిలువరించగలిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని, అత్యాధునిక సాంకేతికత కలిగిన ఇజ్రాయెల్‌ను ఎదుర్కొని ఇరాన్ తన ఉనికిని కాపాడుకుని, ప్రాంతీయశక్తిగా ఆవిర్భవించింది. ఇక, అణు కార్యక్రమం విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసినమాట నిజమేగానీ, శుద్ధి చేసిన యురేనియంను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు గతంలో లేని పట్టు ఇప్పుడు రావడానికి ఈ యుద్ధమే కారణమైంది. ఇప్పుడా మార్గంలో టోల్ వసూలు ప్రతిపాదన ద్వారా దానిపై శాశ్వత నియంత్రణకు ఇరాన్ ప్రయత్నాలు చేస్తోంది.
ట్రంప్ కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ క్షిపణులను ప్రయోగించడం.. చెక్కుచెదరని ఆ దేశ రాజకీయ నాయకత్వ సంకల్ప బలానికి, ఆ దేశ సైనిక సామర్థ్యానికి నిదర్శనమని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక శక్తిమంతమైన దేశం చిన్నదేశంపై విరుచుకుపడి.. పూర్తిగా ఓడించలేకపోతే, అది ఆ చిన్నదేశం విజయం కిందే పరిగణించవచ్చు. ఆ కోణంలో చూస్తే ఇరాన్‌ను ఈ యుద్ధంలో విజేతగానే అభివర్ణించవచ్చు. అలాగని ఈ యుద్ధంలో ఇరాన్ సంపూర్ణంగా గెలిచిందా.. అంటే అవుననీ చెప్పలేం. ఎందుకంటే.. ఎంతో మంది ఇరాన్ పౌరులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలోని మౌలికసదుపాయాలు, చమురు క్షేత్రాలు, పారిశ్రామిక కేంద్రాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశ అగ్ర నాయకత్వాన్ని ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి.
గల్ఫ్ దేశాల కష్టం..
ఇరాన్‌కన్నా ఎక్కువగా ఈ యుద్ధంలో నష్టపోయింది గల్ఫ్ దేశాలు. యూఏఈ, సౌదీ, కువైత్, ఇరాక్, బహరైన్‌లోని పలు ప్రాంతాలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క యూఏఈపైనే ఇరాన్ దాదాపు 520 క్షిపణులు, 2000 కామికాజీ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, యూఏఈకి ఆర్థిక ఇంజన్లు అయిన దుబాయ్, షార్జా వంటివి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దుబాయ్ పర్యాటక, రియల్ ఎస్టేట్ రంగాలు కుప్పకూలాయి. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన పట్టును కొనసాగించి, పూర్తిగా నియంత్రించగలిగితే.. ఆ దారి గుండా ఎగుమతి, దిగుమతులకు యూఏఈ పూర్తిగా ఇరాన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అటు.. సౌదీ వద్దనున్న అత్యాధునిక అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.. ఇరాన్ దాడులను పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఫలితంగా సౌదీలోని రాస్‌తనూరా వంటి చమురుశుద్ధి కర్మాగారాలు, పలు పారిశ్రామిక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కాస్త తగ్గి, చర్చలకు రావడానికి.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన ఈ దాడులు కూడా ఒక కారణం. ఇక.. ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా నష్టపోవడమే కాదు. ఆ దేశ పరపతి కూడా పోయింది. ఇన్నాళ్లూ.. ‘మా ఆయుధాలు కొనండి. మా బేస్‌లకు మీ గడ్డపై చోటివ్వండి. మీ భద్రతకు మాదీ హామీ’ అని గల్ఫ్‌లో పలు దేశాలను యూఎస్ తన అధీనంలో ఉంచుకుంది. కానీ.. ఇరాన్ దాడులతో ఆ హామీలన్నీ ఉత్తుత్తివేనని స్పష్టంగా తెలిసిపోయింది. ఇకపై అమెరికా సైనికశక్తిని చూసి గతంలో భయపడినట్టుగా ఎవరూ భయపడే పరిస్థితి ఉండదు.
నెతన్యాహుపై విమర్శల వెల్లువ
రెండువారాల కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించడంతో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై విపక్షాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ నుంచి తీవ్ర అణుముప్పును ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌ను పక్కనపెట్టి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడమేంటని విపక్ష నేత యైుర్ లాపిడ్ మండిపడ్డారు. ఇది దౌత్యపరంగా నెతన్యాహు వైఫల్యమేనని ఆయన నిప్పులుచెరిగారు. విజయం సాధించకుండానే యుద్ధం ఆగడంతో ప్రజల్లో కూడా నెతన్యాహు పరపతి తగ్గింది. పలువురు మంత్రులు ఈ కాల్పుల విరమణను లొంగుబాటుగా భావిస్తున్నారు. వారు మద్దతు ఉపసంహరించుకుంటే నెతన్యాహు ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి..
ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..
ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..