Share News

వంటింట్లోకి వార్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:04 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్‌పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్‌...

వంటింట్లోకి వార్‌

యుద్ధం దెబ్బకు గ్యాస్‌ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు

గృహ వినియోగ సిలిండర్‌ రూ.60, వాణిజ్య సిలిండర్‌ రూ.115 పెంపు

గ్యాస్‌, చమురేకాదు..

పరిశ్రమలపైనా పిడుగు!

ఉక్కు, సిమెంటు, ఎరువులు సహా

పారిశ్రామిక రంగాలపై ప్రభావం

సంక్షోభంలో సాగు ఎగుమతులు

రసాయన పరిశ్రమలకూ దెబ్బే

సిమెంటు ధర భారీగా పెరిగే చాన్స్‌

న్యూఢిల్లీ, మార్చి 7: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్‌పై పడింది. మొదటిగా వంటింటిపై ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెటింగ్‌ సంస్థలు గ్యాస్‌ సిలిండర్ల ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్‌ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.965కు చేరింది. దేశ రాజదాని ఢిల్లీలో రూ.913, ముంబైలో 912.50, కోల్‌కతాలో రూ.930, చెన్నైలో రూ.928.50కు చేరాయి. పెరిగిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇక 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో ఏకంగా రూ.2105.50కు పెరిగింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా ఈ పెరుగుదల వర్తించనుంది. వీరు ఇకపై ప్రతి సిలిండర్‌కు రూ.613 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఏడాదికి గరిష్ఠంగా 12 సిలిండర్లు అందజేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ తర్వాత ఎల్పీజీ గ్యాస్‌ ధర పెరగడం ఇదే మొదటిసారి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగి.. దాని ప్రభావం గ్యాస్‌ ధరలపై పడింది. అయితే గ్యాస్‌ ధరల తాజా పెరుగుదల పెద్దగా ప్రభావం చూపించేది కాదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబం ఏడాదికి 4-5 సిలిండర్లు వినియోగిస్తుందనుకుంటే.. రోజుకు 80 పైసలు మాత్రమే పెరిగినట్లవుతుందని, కుటుంబంలోని ఒక్కో వ్యక్తిపై రోజుకు 20 పైసలు మాత్రమే అదనపు భారం పడుతుందని విశ్లేషిస్తున్నాయి. పైగా, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. మన దేశంలో గ్యాస్‌ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెబుతున్నాయి.


పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగవు..!

ఎల్పీజీ గ్యాస్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళన దేశ ప్రజల్లో నెలకొంది. అయితే ఈ ధరలు పెరగబోవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, హోర్ముజ్‌ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా క్రూడాయిల్‌ దిగుమతిని 10 శాతం పెంచుకున్నామని, ఇంతకుముందు 60 శాతంగా ఉన్న దిగుమతులు ప్రస్తుతం 70 శాతానికి పెరిగాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చర్య దేశంలో ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసి.. ధరలు పెరగకుండా నిరోధిస్తుందని తెలిపాయి. కాగా, ప్రపంచ ఇంధన మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ఇంధన నిల్వల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం, సహజ వాయువు శాఖల మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి శుక్రవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. వినియోగదారులు సోషల్‌ మీడియాలో జరిగే ప్రచారాన్ని పట్టించుకోవద్దని, పెట్రోలు బంకుల్లో క్యూ కట్టాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. అయితే ఇంధన నిల్వలకు కొరత లేదంటూ పెట్రోలియం శాఖ మంత్రి ప్రకటించిన మరుసటి రోజు ఎల్పీజీ గ్యాస్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా విమర్శలు సంధించారు. మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి మాటలను ఎప్పటికీ నమ్మవద్దని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

సిమెంటు ధరలు పైపైకి!

నిర్మాణరంగానికి సంబంధించి కీలకమైన లైమ్‌స్టోన్‌ను 68.5ు, జిప్సమ్‌ను 62.1ు దిగుమతి చేసుకుంటున్నామని.. ఈ రెండు ఖనిజాల సరఫరాపై ప్రభావం పడితే నిర్మాణరంగం కుదేలయ్యే ప్రమాదం ఉందని జీటీఆర్‌ఐ తెలిపింది. లైమ్‌స్టోన్‌ను సిమెంటు ఉత్పత్తిలోను, జిప్సమ్‌ను సిమెంటు సహా ఇతర నిర్మాణ సామగ్రిలోనూ వినియోగిస్తారు. వీటి సరఫరాపై ప్రభావం పడితే సిమెంటు ధరలు భారీగా పెరగడంతోపాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దాదాపు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది.


ఎరువులు, స్టీల్‌..

యుద్ధం ప్రభావం కీలకమైన ఎరువులు, స్టీల్‌ ఉత్పత్తిపై పడనుందని జీటీఆర్‌ఐ వెల్లడించింది. పశ్చిమాసియా నుంచి 420 మిలియన్‌ డాలర్ల విలువైన(65.8ు) సల్ఫర్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ఉత్పత్తిలో దీనిని వినియోగిస్తున్నారు. ఇది ఎరువుల ఉత్పత్తిలోను, పలు రసాయన పరిశ్రమలకు కీలకంగా ఉంది. అదేవిధంగా 190 మిలియన్‌ డాలర్ల విలువైన(59.1ు) డైరెక్ట్‌ రెడ్యూస్డ్‌ ఐరన్‌(డీఆర్‌ఐ)ను భారత్‌ దిగుమతి చేసుకుని.. దీనిని ఉక్కుతయారీకి వినియోగిస్తోంది. అలాగే, 869 మిలియన్‌ డాలర్ల విలువైన(50.7ు) కాపర్‌ వైర్‌ కూడా పశ్చిమాసియా నుంచే దిగుమతి అవుతోంది. యుద్ధ ప్రభావం వీటిపై స్పష్టంగా పడే అవకాశం ఉందని, దీంతో ఆయా రంగాలు ప్రభావితమవుతాయని జీటీఆర్‌ఐ తెలిపింది.

పరిశ్రమలపైనా ‘యుద్ధ’ పిడుగు!

మన దేశం విషయానికి వస్తే.. పరిశ్రమలకు కీలకమైన ముడిసరుకులు పశ్చిమాసియా ప్రాంతం నుంచే వస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే వాణిజ్య సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రిసెర్చ్‌ ఇనిషియేటివ్‌(జీటీఆర్‌ఐ) అంచనా ప్రకారం 2025లో మన దేశం పశ్చిమాసియా నుంచి 98.7 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కొనసాగినా.. హొర్ముజ్‌ జలసంధిని నిలిపివేసినా ఆ ప్రభావం తక్షణమే దేశ పరిశ్రమ రంగాన్ని అతలాకుతలం చేయనుంది. కేవలం చమురు, గ్యాస్‌ మాత్రమే కాకుండా కీలక పారిశ్రామిక రంగంపై పెనుప్రభావం పడనుంది. యుద్ధ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని తెలిపింది. జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం.. ఎరువుల సరఫరా, తయారీ రంగం ముడి సరుకులు, నిర్మాణ సామగ్రి, వజ్రాల పరిశ్రమలపై యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలతో నౌకలు నిలిచిపోవడంతో వ్యవసాయ, ఆహార రంగానికి చెందిన ఉత్పత్తుల ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నాయని జీటీఆర్‌ఐ పేర్కొంది. బీమా ధరలు పెరిగిపోవడంతోపాటు లాజిస్టిక్స్‌లో అనిశ్చితి నెలకొందని తెలిపింది. ఫలితంగా పశ్చిమాసియాకు చేరాల్సిన 11.8 బిలియన్‌ డాలర్ల విలువైన భారత ఎగుమతులు సంక్షోభంలో చిక్కుకున్నట్టు తెలిపింది. వీటిలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ

Updated Date - Mar 08 , 2026 | 05:05 AM