వందేమాతరాన్ని అవమానిస్తే జైలుకే..
ABN , Publish Date - May 07 , 2026 | 07:36 AM
జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానిస్తే జైలుకే! ఈ మేరకు చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ చట్ట సవరణ చేయడానికి క్యాబినెట్ ఆమోదం
గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష
న్యూఢిల్లీ, మే 6: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానిస్తే జైలుకే! ఈ మేరకు చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. పశ్చిమ బెంగాల్‌లో ఘనవిజయం తర్వాత జరిగిన తొలి భేటీలోనే దీనిపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జాతీయ గౌరవాన్ని భంగపరిచే చర్యల నిరోధక చట్టం- 1971 పరిధిలో ఇప్పటివరకు జాతీయగీతం జనగణమన, భారత రాజ్యాంగం, జాతీయ పతాకం ఉండేవి. ‘‘జనగణమన ను పాడకుండా కావాలని అడ్డుకున్నా, ఒకచోట చేరి ఆ గీతం పాడుతున్న సమూహంలో అలజడి రేపడానికి ప్రయత్నించినా చట్టరీత్యా శిక్షార్హ నేరంగా పరిగణించడం జరుగుతుంది’’ అని చట్టంలోని మూడో సెక్షన్ స్పష్టం చేస్తోంది. దానికి సవరణ తీసుకురావడం ద్వారా జనగణమనతో సమాన స్థాయిని వందేమాతరానికీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. తాజా ప్రతిపాదిత చట్ట సవరణ ప్రకారం..వందేమాతరాన్ని అవమానించడం చట్టరీత్యా నేరం. ఈ నేరం చేసిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలుశిక్ష లేక జరిమానా లేక ఈ రెండింటినీ కోర్టు విధించవచ్చు. మొదటి తప్పును జరిమానాతో సరిపెడతారు. కానీ, అదే తప్పును మళ్లీ చేస్తే జైలుశిక్షను విధించవచ్చు.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ