సంపన్నుల భారతం!
ABN , Publish Date - Apr 24 , 2026 | 06:16 AM
భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితా మరింతగా పెరుగుతోంది. ఆస్తుల పరంగా అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే...
అత్యధిక నికర ఆస్తులున్న కుబేరుల జాబితాలో భారత్‌కు ఆరో స్థానం
వచ్చే ఐదేళ్లలో మరో 27 శాతం పెరుగుదల
2031 నాటికి 51 శాతం పెరుగుదలతో 313కు చేరనున్న బిలియనీర్ల సంఖ్య
‘నైట్ ఫ్రాంక్’ సంస్థ అంచనాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: భారత్‌లో అత్యంత సంపన్నుల జాబితా మరింతగా పెరుగుతోంది. ఆస్తుల పరంగా అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తుల (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే ఆరో స్థానంలో నిలిచింది. రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ అంచనా వేసింది. ప్రస్తుతం 2026 ఏడాది నాటికి భారత్‌లో 30 మిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆస్తులు (సుమారు రూ.280 కోట్లకుపైగా) కలిగి ఉన్నవారి సంఖ్య 19,877గా ఉంది. ఇది ప్రపం చ యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ పాపులేషన్‌లో 2.8 శాతంగా ఉంది. భారత్‌లో యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ క్యాటగిరీలోని సంపన్నుల సంఖ్య 2031 నాటికి 27శాతం పెరిగి, 25,217కు చేరుకుంటుందని పేర్కొంది. భౌగోళిక ఆస్థిరతలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. టెక్నాలజీ, పారిశ్రామిక, క్యాపిటల్ మార్కెట్లలో నిలకడైన సంపద సృష్టి కారణంగా ఈ పరిణామం చోటుచేసుకోనుందని తెలిపింది. అదేవిధంగా భారత్‌లోని బిలియనీర్ల సంఖ్యలో అధిక పెరుగుదల కనిపించనుంది. 2026నాటికి గత ఐదేళ్లలో 58 శాతం పెరుగుదలతో 207కు చేరుకున్న బిలియనీర్ల సంఖ్య.. 2031 నాటికి 51 శాతం పెరిగి 313కు వెళ్లనుందని ‘నైట్ ఫ్రాంక్’ పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచ బిలియనీర్ల సంఖ్యలో భారత్ వాటా కూడా 6.7 నుంచి 8 శాతానికి పెరగనుంది. కాగా, ప్రస్తుతానికి చూస్తే బిలియనీర్ల సంఖ్యలో అమెరికా (914), చైనా (485)ల తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రపంచ సంపద పంపిణీలో కీలక మార్పు కనిపిస్తోందని, అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ.. భారత్ నుంచి సంఖ్యా బలం పెరుగుతోందని నైట్ ఫ్రాంక్ రిసెర్చ్ హెడ్ లియామ్ బెయిలీ అన్నారు.
సంపన్నుల జాబితాలో ముంబై టాప్
దేశంలో అత్యంత సంపన్నులు ఉన్న నగరాల జాబితాలో సంఖ్యాపరంగా కొంత తగ్గినా.. ముంబై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. భారత యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ వ్యక్తుల లిస్టులో 35.4 శాతం మంది ఇక్కడి వారే కావడం గమనార్హం. 2015లో ఈ సంఖ్య ఇప్పటి కంటే ఎక్కువగా 41.3 శాతం ఉండేది. సంపదలో ఈ మార్పు క్రమంగా వికేంద్రీకరణ చెందుతున్నట్లు కనిపిస్తోంది. 2026నాటికి ఢిల్లీ తన వాటాను 22.8 శాతానికి పెంచుకోగా.. గత దశాబ్దకాలంలో బెంగళూరు (10.6 శాతం), హైదరాబాద్(6..3 శాతం), చెన్నై (4.8 శాతం) వంటి నగరాలు కూడా ఈ విషయంలో చాలా మెరుగుపడ్డాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ మాట్లాడుతూ.. భారత సంపన్న వర్గాల విస్తరణ దాని ఆర్థిక పరిణామాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భారత్ మరింత వ్యవస్థాపక ఆర్థిక వ్యవస్థగా పరిణతి చెందుతోందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి