Share News

ఇరాన్‌ దాడిలో నా భర్త చనిపోలేదు

ABN , Publish Date - Aug 05 , 2026 | 06:16 AM

ఇరాన్‌-అమెరికా యుద్ధం మొదలైన మరునాడు ఒమన్‌ తీరంలోని వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన మర్చంట్‌ నేవీ కెప్టెన్‌ ఆశీ్‌షకుమార్‌ బతికే ఉన్నారని.. ఆయన ఆచూకీ కనుక్కోవడంలో...

ఇరాన్‌ దాడిలో నా భర్త చనిపోలేదు

  • విదేశాల్లో బంధించారు..రూ.20 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారు

  • సుప్రీంకోర్టులో భారతీయ నావికుడు ఆశీష్‌ భార్య రిట్‌ పిటిషన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఇరాన్‌-అమెరికా యుద్ధం మొదలైన మరునాడు ఒమన్‌ తీరంలోని వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన మర్చంట్‌ నేవీ కెప్టెన్‌ ఆశీ్‌షకుమార్‌ బతికే ఉన్నారని.. ఆయన ఆచూకీ కనుక్కోవడంలో విదేశాంగ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆయన భార్య సుప్రీంకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ వేశారు. తన భర్త ఆచూకీని కనుగొనేందుకు అవసరమైన దౌత్య, నిఘా పరమైన చర్యలు వేగంగా చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. మార్చి 1న హోర్ముజ్‌ జలసంధిలో ఎంటీ స్కైలైట్‌ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. నౌకలోని 20 మందిలో 18 మందిని ఒమన్‌ కోస్ట్‌గార్డ్‌ రక్షించగా, ఆశీ్‌షతోపాటు మరొకరు గల్లంతయ్యారు. నౌకలోని ఇంజన్‌ రూమ్‌లో ఎముకలు దొరికాయి. దీనితో ఆశీష్‌ చనిపోయి ఉంటారని భావించారు. అయితే ఎముకల డీఎన్‌ఏ, ఆశీష్‌ సోదరుడి డీఎన్‌ఏ సరిపోలలేదు. దీంతో, ఆశీష్‌ ఏమయ్యారన్నది తెలియకుండా పోయింది. ఈ క్రమంలో ఆశీష్‌ భార్య తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆశీష్‌ బతికే ఉన్నారని కోర్టుకు వివరించారు. నౌకపై క్షిపణి దాడి జరిగిన మూడు గంటల తర్వాత కూడా ఆశీష్‌ ఫోన్‌కు పంపిన వాట్సాప్‌ సందేశం డెలివరీ అయిందని తెలిపారు. ఆశీష్‌ తమ వద్ద బందీగా ఉన్నారంటూ మార్చి 4న పలు అంతర్జాతీయ, స్థానిక నంబర్లతో కాల్స్‌ వచ్చాయని, రూ.20 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పారని వివరించారు. ఈ వివరాలన్నింటినీ విదేశాంగ శాఖ, ఒమన్‌లోని భారతీయ ఎంబసీకి అందించినా తగిన దర్యాప్తు చేపట్టలేదని వివరించారు.

ఇవి కూడా చదవండి..

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..

Updated Date - Aug 05 , 2026 | 06:16 AM