విమానాలు నడపలేం.. పెరిగిన ఇంధన ధరలతో భారత విమానయాన సంస్థల గగ్గోలు..
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:48 AM
విమాన ఇంధనం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు పెరగడంపై భారతీయ విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏటీఎఫ్ ధరలు ఇలానే కొనసాగితే...
ప్రభుత్వం చొరవ తీసుకోకుంటే సేవల నిలిపివేతే
నిర్వహణ ఖర్చులో 50-60 శాతానికి చేరిన ఇంధన వాటా
ఏటీఎ్‌ఫపై 11% ఎక్సైజ్ సుంకం తాత్కాలికంగా ఎత్తేయాలి
రాష్ట్రాలు వసూలు చేస్తున్న వ్యాట్‌ను కూడా తగ్గించాలి
విమానయాన శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ లేఖ
పౌర విమానయాన శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ లేఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధనం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరలు పెరగడంపై భారతీయ విమానయాన సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఏటీఎఫ్ ధరలు ఇలానే కొనసాగితే విమానాలను నడపలేమని ప్రభుత్వానికి మూకుమ్మడిగా లేఖ రాశాయి. ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోకపోతే నష్టాలను భరించలేమని, విమాన సేవలను తాత్కాలికంగా లేదా పూర్తిగా నిలిపివేయడం తప్ప తమకు మరో మార్గం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్ జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్(ఎ్‌ఫఐఏ) పౌర విమానయాన శాఖ కార్యదర్శికి ఇటీవల లేఖ రాసింది. గత నెలలో ప్రభుత్వం దేశీయ అవసరాలకు వాడే ఏటీఎఫ్ ధరను లీటరుకు రూ.15 చొప్పున, అంతర్జాతీయ అవసరాలకు వాడే ఏటీఎఫ్ ధరను లీటరుకు రూ.73 మేర పెంచింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర ఇటీవల రూ.2లక్షలు దాటిందని ఎఫ్‌ఐఏ తన లేఖలో పేర్కొంది. విమానాల నిర్వహణ ఖర్చులో 40ు వాటా ఇంధనానిదేనని, ఇటీవల పెరిగిన ధరలతో ఆ వాటా 55 నుంచి 60 శాతానికి చేరిందని ఎఫ్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్గాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉందని వాపోయింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని ఇంధన ధరలను స్థిరీకరించాలని కోరింది.
డిజీల్, పెట్రోల్ ధరల నియంత్రణకు ఉన్నట్టు ఏటీఎఫ్ ధరల నియంత్రణకు కూడా ఓ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు దేశంలో ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూసేందుకు గతంలో మాదిరి క్రాక్ బ్యాండ్ వ్యవస్థను తిరిగి అమలు చేయాలని ఎఫ్‌ఐఏ విన్నవించింది. అదేవిధంగా ఏటీఎ్‌ఫపై ఉన్న 11% ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా ఎత్తివేయాలని, రాష్ట్ర స్థాయిలో ఏటీఎ్‌ఫపై ఉన్న వ్యాట్‌ను కూడా తగ్గించాలని కోరింది. ఎఫ్‌ఐఏ ప్రకారం.. తమిళనాడులో ఏటీఎ్‌ఫపై దేశంలోనే అత్యధికంగా 29ు, ఆ తర్వాత ఢిల్లీలో 25ు వ్యాట్ వసూలు చేస్తున్నారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాల్లో 16 నుంచి 20 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తున్నారు. ఇంధనంపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో వసూలు చేస్తోన్న పన్నుల వల్ల భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసుల విషయంలో ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నాయని ఎఫ్‌ఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతమున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని మార్గాల్లో విమానాలను నడపడం సంస్థలకు ఆర్థికంగా భారమని కూడా వెల్లడించింది. కాగా, భారతీయ రిఫైనరీలు చేసే ఉత్పత్తిలో ఏటీఎఫ్ వాటా కేవలం 4ు మాత్రమేనని ఎఫ్‌ఐఏ తన లేఖలో పేర్కొంది. మొత్తం ఉత్పత్తిలో 30ు ఏటీఎ్‌ఫను దేశీయ విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..