Share News

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి.. 52 లక్షల వివాహాలతో రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం!

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:44 AM

దేశంలో మళ్లీ పెళ్లి సందడి మొదలు కాబోతోంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో లక్షల ఇళ్లల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. శనివారం(నవంబరు 21) నుంచి డిసెంబరు 15వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి.

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి.. 52 లక్షల వివాహాలతో రూ.7.5 లక్షల కోట్ల వ్యాపారం!

  • డిసెంబరు 15 వరకు దేశవ్యాప్తంగా 52 లక్షల వివాహాలు

  • రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం

న్యూఢిల్లీ, నవంబరు 21: దేశంలో మళ్లీ పెళ్లి సందడి మొదలు కాబోతోంది. రాబోయే 23 రోజుల వ్యవధిలో లక్షల ఇళ్లల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. శనివారం(నవంబరు 21) నుంచి డిసెంబరు 15వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా 52 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి దాదాపు 25 రోజులు పాటు ఆయా కుటుంబాలు.. షాపింగ్‌లు, ఫొటో షూట్‌లు, విందులు, వినోదాలతో సందడిగా ఉండనున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. నాణేనికి మరోవైపు ఈ పెళ్లిళ్ల ద్వారా రూ.లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. ఈ 52 లక్షలకు పైగా వివాహాల ద్వారా దేశ వ్యాప్తంగా రూ.7.5 లక్షల కోట్ల మేర వ్యాపారం జరగనుందని ఆలిండియా వర్తక సమాఖ్య(సీఏఐటీ) అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 300 మంది బడా వ్యాపారులు, 550 వర్తక సంఘాలతో సంప్రదింపులు చేసి ఈ అధ్యయనం రూపొందించారు. ఈ అంచనా ప్రకారం పెళ్లికి సంబంధించిన వివిధ రకాల వస్తువుల కొనుగోళ్ల రూపంలోనే రూ.4.05 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది.


మొత్తం రూ.7.5 లక్షల కోట్లలో ఇది 54 శాతం కావడం గమనార్హం. అలాగే పెళ్లిళ్లకు సంబంధించిన వివిధ సేవల ద్వారా రూ.3.5 లక్షల కోట్ల వ్యాపారం జరగనుంది. కాగా, బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల కొనుగోళ్ల రూపంలో ఆ రంగానికి రూ.1.2 లక్షల కోట్లు సమకూరనున్నాయి. అలాగే, దుస్తులు, వస్త్రాల కొనుగోళ్ల రూపంలో రూ.90,000 కోట్ల మేర వ్యాపారం జరగనుంది. కానుకలు, పెళ్లికి సంబంధించిన చిన్నచిన్న వస్తువులు, సరుకులు, ఆహార ఉత్పత్తులకు సంబంధించి రూ.37,500 కోట్ల మేర కొనుగోళ్లు జరుగుతాయని అంచనా. అదే విధంగా ఎలకా్ట్రనిక్‌ వస్తువులు, డ్రై ఫ్రూట్స్‌, స్వీట్లు, ఫర్నిచర్‌, గృహోపకరణాల వాటా రూ.75,000 కోట్లు ఉండనుందని సీఏఐటీ అంచనా వేసింది.


ఇక, కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, హోటళ్ల రంగంలో రూ.60,000 కోట్ల మేర వ్యాపారం జరగనుందని పేర్కొంది. అదే విధంగా వెడ్డింగ్‌ ప్లానింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, డెకరేషన్‌ రంగాల్లో రూ.37,500 కోట్ల మేర వ్యాపారం జరగనుంది. ఇదిలా ఉండగా.. రవాణా, సంగీతం, ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీస్‌ రంగాల్లో రూ.30,000 కోట్ల చొప్పున వ్యాపారం జరగనుంది. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, బ్యూటీ సర్వీస్‌ రంగాలు కూడా రూ.22,500 కోట్ల చొప్పున రాబడి పొందనున్నాయి. వ్యాపారులకు రూ.లక్ష కోట్ల రాబడి తెచ్చిపెడుతున్న ఈ పెళ్లిళ్ల సీజన్‌ ద్వారా.. క్యాటరింగ్‌, డెకరేషన్‌, ఫొటోగ్రఫీ, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, బ్యూటీ సర్వీసెస్‌ సహా వివిధ రంగాల్లో దాదాపు 1.25 కోట్ల మందికి తాత్కాలిక ఉపాధి పొందనున్నారని సీఏఐటీ పేర్కొంది.

Updated Date - Nov 22 , 2026 | 08:09 AM