ఊసులాడే వాహనాలు
ABN , Publish Date - Aug 04 , 2026 | 05:33 AM
హదారి భద్రతను పెంచడం, హైవేలపై ప్రమాదాలను నివారించడం, కనెక్టెడ్ టెక్నాలజీల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా.. ‘వెహికల్ టు వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థ’ను దేశంలో దశలవారీగా...
రహదారి భద్రతకు వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ
ఈ విధానంలో రేడియో సిగ్నల్స్ ద్వారా ఒక
వాహనం నుంచి మరో వాహనానికి సమాచారం
చాలా వాహనాల్లో ఉంటున్న అడా్‌సకు భిన్నం
దశలవారీ అమలుకు కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్
రేడియో సిగ్నల్స్ ప్రసారానికి ఫ్రీక్వెన్సీ కేటాయింపు
2028 అక్టోబరు 1 నుంచి అన్ని వాహనాల్లోనూ
ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి
న్యూఢిల్లీ, ఆగస్టు 3: రహదారి భద్రతను పెంచడం, హైవేలపై ప్రమాదాలను నివారించడం, కనెక్టెడ్ టెక్నాలజీల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా.. ‘వెహికల్ టు వెహికల్ (వీ2వీ) కమ్యూనికేషన్ వ్యవస్థ’ను దేశంలో దశలవారీగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దాని ప్రకారం.. 2027 అక్టోబరు 1, ఆ తర్వాత తయారయ్యే ఎల్, ఎం, ఎన్ కేటగిరీ వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం ఐచ్ఛికం. 2028 అక్టోబరు 1, ఆ తర్వాత తయారయ్యే వాహనాల్లో ఈ వ్యవస్థను అమర్చడం తప్పనిసరి. ఈ వ్యవస్థను అమర్చాలంటే ప్రతి కంపెనీ కచ్చితంగా ‘ఏఐఎస్-230’ ప్రమాణాలకు లోబడి అమర్చాల్సిందే. అలా కాకుండా కంపెనీలు తమకిష్టమొచ్చిన సాంకేతికతను వాడితే.. ఒక కంపెనీ కారు ఇంకో కంపెనీ కారుతో సమాచార మార్పిడి చేసుకోలేదు. అందుకే ఈ ప్రమాణాన్ని వాడడం తప్పనిసరి చేశారు. ఇక.. పైన పేర్కొన్నవాటిలో ఎల్ కేటగిరీ వాహనాలంటే.. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు (బైకులు, ఆటోలు). ఎం కేటగిరీ అంటే.. కార్లు, బస్సులు, వ్యాన్లు. ఎన్ కేటగిరీలో.. లారీలు, ట్రక్కుల వంటి సరకు రవాణా (గూడ్స్) వాహనాలుంటాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు తమ వేగం, స్థానం, వెళ్తున్న దిశ, త్వరణం (యాక్సిలరేషన్) వంటి వివరాలను పరస్పరం అత్యంత వేగంగా, రియల్‌టైమ్‌లో ఇచ్చిపుచ్చుకోవడానికి, తద్వారా ప్రమాదాలను నివారించడానికి ఈ వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సమాచారం ఆధారంగా.. ఏదైనా వాహనం ప్రమాదానికి గురయ్యే ముప్పుంటే వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ డ్రైవర్లను, వాహనంలోని అత్యవసర స్పందన వ్యవస్థలను అప్రమత్తం చేస్తుంది. ఉదాహరణకు.. మనం ఒక కారులో వేగంగా వెళ్తుంటాం. మనముందున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే మనకు తెలుస్తుంది. కానీ.. దానికన్నా ముందున్న కారు అలా సడన్ బ్రేక్ వేస్తే? మామూలుగా అయితే మనకు తెలియదు. అదే వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే ఆ ముందు కారు బ్రేక్ వేసిన విషయం కూడా రేడియో సిగ్నల్స్ ద్వారా తెలుస్తుంది. మనకు మాత్రమే కాదు.. ఆ ప్రదేశంలో ఉన్న అన్ని కార్లకూ (వాటిలో కూడా వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలి) తెలుస్తుంది. అలాగే.. పొగమంచులోనో, భారీ వర్షంలోనో మనం వెళ్తున్నప్పుడు ముందు ఏముందో అంత స్పష్టంగా కనిపించదు. దీనివల్ల వాహనాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చి ఢీకొనే ప్రమాదం ఉంటుంది. అదే రెండు వాహనాల్లో వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే.. అవి ఒకదానికొకటి సమాచార మార్పిడి చేసుకుని, వేగాన్ని తగ్గించాల్సిందిగా డ్రైవర్లను, వాహనంలోని అత్యవసర స్పందన వ్యవస్థలను అప్రమత్తం చేస్తాయి. హైవేలలో మన కారు లేన్ మారేటప్పుడు.. వెనుక నుంచి వచ్చే వాహనం బ్లైండ్ స్పాట్‌లో ఉంటే అది మన కారు సైడ్ మిర్రర్స్‌లో కనిపించదు.
ఈ వ్యవస్థ ద్వారా ఆ విషయం ముందే తెలుస్తుంది. ఇలా వీ2వీ సమాచార వ్యవస్థ సాంకేతికత మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కొన్ని వాహనాల్లో ఉంటున్న అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) విధానంలో.. వాహనాలకు అమర్చే కెమెరాలు, రేడార్ల వంటివాటి వల్ల మన ముందు, వెనుక, పక్కన ఉన్న వాహనాల గురించి మాత్రమే తెలుస్తుంది. అవి సడన్ బ్రేక్ వేసినా, వేగం తగ్గించినా ఆ వివరాలను మన కారులో ఉండే అడాస్ వంటి వ్యవస్థలు గుర్తిస్తాయి. నాలుగైదు కార్ల ముందుండే వాహనం బ్రేక్ వేస్తే అవి గుర్తించలేవు. కానీ, వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థ రేడియో సంకేతాలపై ఆధారపడి పనిచేస్తుంది. ఈ సిగ్నల్స్ మధ్యలో ఉన్న వాహనాల గుండా కూడా ప్రయాణం చేస్తాయి కాబట్టి.. మన కన్నా ముందెక్కడో ఉండే నాలుగో కారో, ఐదో కారో సడన్ బ్రేక్ వేసినా ఈ వ్యవస్థ వల్ల మనకు ఆ విషయం తెలుస్తుంది. అడాస్ ఉన్న వాహనాలకు ఇది అదనపు బలంగా మారుతుంది. ఈ రేడియో సిగ్నల్స్ ప్రసారానికి 5.875 గిగాహెర్ట్జ్ నుంచి 5.925 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ (పౌనఃపున్య) పరిధిని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తన ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర టెలికం శాఖ జూన్ 10నే ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను లైసెన్సింగ్ అవసరాల నుంచి మినహాయించింది. అంటే.. వాహనాలు తయారుచేసే సంస్థలు ఆ ఫ్రీక్వెన్సీని ఉచితంగా వాడుకునే వీలు కల్పించిందన్నమాట.
కొన్ని ఆందోళనలూ..
వీ2వీ సాంకేతికత వల్ల రహదారి భద్రత గణనీయంగా మెరుగుపడినప్పటికీ.. దానివల్ల కొన్ని సాంకేతిక, రక్షణ పరమైన సమస్యలూ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వీ2వీ సిగ్నల్స్ 5.875 గిగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో ప్రయాణిస్తాయి. హ్యాకర్లు ఈ ఫ్రీక్వెన్సీలోకి ప్రవేశించి తప్పుడు సమాచారాన్ని (ఫేక్ అలర్ట్స్) పంపే ప్రమాదం ఉంది. ఉదాహరణకు.. రోడ్డు ఖాళీగా ఉన్నా, ముందు ఏదో ప్రమాదం ఉందనే తప్పుడు సిగ్నల్ పంపొచ్చు. వాహనదారుడు ఆ అలర్ట్‌తో అప్రమత్తమై సడన్ బ్రేక్ వేస్తే.. వెనుకవచ్చే వాహనాలు దాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంది.
వీ2వీ వ్యవస్థ ఉండే వాహనాలు తాము ఉన్న చోటు, ప్రయాణ వేగం, ప్రయాణించే దిశను నిరంతరం ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగా ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాన్ని ట్రాక్ చేసే ప్రమాదం ఉంటుంది.
వేలాది వాహనాలు ఉండే నగరాల్లో రద్దీ కారణంగా నెట్‌వర్క్ జామ్ అవడానికి ఆస్కారం ఉంటుంది. దీనివల్ల సిగ్నల్ ప్రసారం ఆలస్యం అయ్యి.. అత్యవసర సమయంలో హెచ్చరిక వెళ్లకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగే ముప్పుంది.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..