రక్షణ రంగంలో మరో మైలురాయి.. రుద్ర క్షిపణి పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Jun 02 , 2026 | 09:20 PM
భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్-టు-సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర ఎం-2 క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మంగళవారంనాడు విజయవంతంగా పూర్తి చేసింది.
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్-టు-సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించే రుద్ర ఎం-2 (RudramM-2) క్షిపణి పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మంగళవారంనాడు విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశా తీరం వీలర్ ఐలాండ్‌లోని ఐటీఆర్ చండీపూర్ వేదికగా ఈ పరీక్ష నిర్వహించింది. ముందుగా నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో క్షిపణి ఛేదించినట్టు రక్షిణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక రేంజ్ పరికరాలు, కెమెరాలతో సేకరించిన ఫ్లైట్ డాటా ఆధారంగా ఈ విజయాన్ని నిర్ధారించినట్టు పేర్కొంది.
రుద్ర ఎం-2ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, ఇండస్ట్రీ భాగస్వాములు, డవలప్‌మెంట్ ఏజెన్సీలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధబలగాల బలాన్ని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
రుద్రఎం-2 క్షిపణిని హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ నోడల్ లేబొరేటరీ అయిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది. డీఆర్‌డీఓకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్‌మెంట్ లేబొరేటరీ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లేబొరేటరీ, ఆర్మమెంట్ రీసెర్ట్ అండ్ డవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ల్యాబ్‌లు ఈ ప్రాజెక్టులో కలిసి పనిచేశాయి. డవలప్‌మెట్-కమ్-ప్రొడక్షన్ భాగస్వాములుగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇతర రక్షణ రంగ ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలు వ్యవహరించాయి.
ఇవి కూడా చదవండి..
మమతకు షాక్.. ధర్నాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు
10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు