Share News

క్రూడ్ వార్.. సడలింపులు ముగించిన ట్రంప్.. ‘రష్యా చమురు’పై తగ్గబోమంటున్న భారత్!

ABN , Publish Date - May 18 , 2026 | 07:52 PM

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల గడువు(మే 16)ను పెంచకూడదని ట్రంప్ నిర్ణయించారు. అయితే, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ తేల్చిచెప్పింది.

క్రూడ్ వార్.. సడలింపులు ముగించిన ట్రంప్.. ‘రష్యా చమురు’పై తగ్గబోమంటున్న భారత్!
India Defies US Sanctions, Says Russian Oil Imports Will Continue

న్యూఢిల్లీ/వాషింగ్టన్ (మే 18): అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో సరికొత్త చమురు యుద్ధం (Crude War) మొదలైంది. రష్యా ముడి చమురు (Crude Oil) కొనుగోళ్లపై భారత్‌తో పాటు పలు దేశాలకు గతంలో ఇచ్చిన తాత్కాలిక సడలింపుల (Waivers) గడువును పెంచకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. మే 16వ తేదీతో ఆ గడువు ముగిసిపోయింది. అయితే, ట్రంప్ సర్కార్ మినహాయింపులకు చరమగీతం పలికినప్పటికీ, దేశీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా నుంచి చమురు దిగుమతులను మునుపటిలాగే కొనసాగిస్తామని భారత్ స్పష్టం చేసింది.

ట్రంప్ మైండ్ గేమ్.. అక్కడ ఆంక్షలు.. ఇక్కడ ఊరట!

చైనా పర్యటన ముగించుకుని వాషింగ్టన్ చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ద్వారా రష్యా చమురుపై సడలింపుల గడువును ముగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రష్యాకు వెళ్లే ఆదాయ వనరులను దెబ్బతీయడమే దీని లక్ష్యమని వైట్ హౌస్ చెబుతోంది.

అయితే, ఈ ప్రకటన వెనుక ట్రంప్ పెద్ద పొలిటికల్ మైండ్ గేమే ఆడుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో నవంబర్‌లో రాబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల నేపథ్యంలో దేశీయంగా గ్యాస్ ధరలు ఒక్కసారిగా గ్యాలన్‌కు $4.50 దాటేశాయి. దీంతో ఓటర్ల ఆగ్రహానికి గురికాకూడదనే ఉద్దేశంతో 'ఫెడరల్ గ్యాస్ టాక్స్' (చమురు పన్ను) ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అలాగే రష్యాపై కఠినంగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తూనే.. ఇటువైపు ఇరాన్ చమురు కొనే చైనా కంపెనీలపై ఆంక్షలు ఎత్తివేసేలా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మాట్లాడటం గమనార్హం.


హోర్ముజ్ సంక్షోభం.. భారత్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం వల్ల 'హోర్ముజ్ జలసంధి' గుండా చమురు రవాణా స్తంభించి ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ రష్యా చమురును ఆపేస్తే, అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $120 దాటిపోతుంది. అది తిరిగి అమెరికా ఆర్థిక వ్యవస్థకే దెబ్బ కొడుతుంది.

ఈ అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో భారత్.. ట్రంప్ ఆంక్షలపై మునుపెన్నడూ లేనంత దీటుగా స్పందించింది. ఇవాళ (మే 18న) కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఢిల్లీలో మీడియా సమావేశంలో అధికారికంగా స్పందిస్తూ.. 'అమెరికా సడలింపుల గడువు ముగిసినా, ముగియకపోయినా.. దేశ ఇంధన భద్రతే (Energy Security) మాకు ముఖ్యం. రష్యా నుంచి మా చమురు కొనుగోళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవు, యథావిధిగా కొనసాగుతాయి' అని తేల్చి చెప్పారు.

సైలెంట్‌గా ఉన్న వాషింగ్టన్.. దౌత్యనీతి గెలిచేనా?

భారత్ ఇంత ఓపెన్‌గా అమెరికా ఆంక్షలను సవాల్ చేస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, వాషింగ్టన్ లోని వైట్ హౌస్ గానీ, ట్రెజరీ డిపార్ట్‌మెంట్ గానీ భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయకుండా మిన్నకుండిపోయాయి. అంటే, అమెరికా తన ఓటర్ల కోసం 'పేపర్ మీద ఆంక్షలు' పెడుతున్నట్లు నటిస్తూనే.. గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరగకుండా ఉండటానికి భారత్ లాంటి దేశాలు రష్యా చమురు కొనడాన్ని లోపాయకారీగా చూసీచూడనట్లు వదిలేసే వ్యూహాన్ని అవలంబిస్తోందని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 18 , 2026 | 09:03 PM